డీజే సౌండ్​ తగ్గించమన్నందుకు కొట్టి చంపిన్రు

డీజే సౌండ్​ తగ్గించమన్నందుకు కొట్టి చంపిన్రు
  • డీజే సౌండ్​ తగ్గించమన్నందుకు కొట్టి.. మీదెక్కి డ్యాన్సు చేసి చంపిన్రు
  • ఊపిరాడక పోయిన ప్రాణం
  • నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో దారుణం
  • పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు

నర్సాపూర్( జి) వెలుగు: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం కాల్వతండాలో డీజే సౌండ్​ తగ్గించమని అడిగినందుకు ఓ యువకుడిని చితకబాది మీదెక్కి డ్యాన్స్​ చేయడంతో ఊపిరాడక చనిపోయాడు.  గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం...కాల్వతండా గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లో యువకులకు వేరే ఊర్ల అమ్మాయిలతో బుధవారం పెండ్లిళ్లు జరిగాయి. రాత్రి బారాత్​ పెట్టుకున్నారు. తొమ్మిది, పది గంటల మధ్య రెండు కుటుంబాలకు చెందిన రెండు డీజేలను ఊర్లోకి తీసుకువచ్చారు. వచ్చినప్పటి నుంచే పెద్ద సౌండ్​తో పాటలు పెట్టి డ్యాన్సులు చేయడం స్టార్ట్ చేశారు. సాయికుమార్​అనే యువకుడి పెండ్లికి బంధువులు , ఫ్రెండ్స్​ పెద్ద సంఖ్యలో రావడంతో డీజే ఆపరేటర్ ​మాగ్జిమమ్​ సౌండ్ ​పెట్టాడు. దీంతో ముందు మరో పెండ్లిలో డ్యాన్సులు చేస్తున్న వారు కూడా ఇక్కడికే వచ్చారు. అప్పటికే రాత్రి 11: 30 కావస్తోంది. బారాత్ ​జరిగే చోట ఓ ఇంట్లో నాలుగేండ్ల  చిన్నారితోపాటు, మూడు నెలల పాప ఉన్నారు. వీరు శబ్దాన్ని భరించలేక పెద్దపెట్టున ఏడ్వడం మొదలుపెట్టారు. ఇది చూసిన వారి తండ్రి మెగావత్ నవీన్ కుమార్(28) బయటకు వచ్చి పిల్లలు ఏడుస్తున్నారని, సౌండ్​ తగ్గించాలని కోరాడు.  

కొట్టి..పైన డ్యాన్స్​చేసి...
పెండ్లికి వచ్చిన వారు మద్యం మత్తులో ఉండడం తో నవీన్​ ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు. సౌండ్​ తగ్గించేది లేదని, ఏం చేస్కుంటావో చేస్కొ మ్మని మరింత సౌండ్​ పెంచారు. గట్టిగా అడగడంతో ‘మాకే చెప్తావ్ ​రా’ అంటూ ఇష్టమున్నట్టు కొట్టారు. అంతటితో వదిలేయకుండా సుమారు 15 మంది  కింద పడేసి తొక్కుతూ డ్యాన్స్ చేశారు. దీంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. బంధువులు నిర్మల్ దవాఖానాకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. నవీన్​ కొన్నేండ్ల కిందే హైదరాబాద్​లో బీటెక్​ కంప్లీట్​చేసి ఊరికి వచ్చాడు. పెండ్లి చేసుకుని భార్యాపిల్లలతో గ్రామంలో ఉంటున్నాడు. 

సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి...
నవీన్​ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామానికి వెళ్లి సీసీ ఫుటేజీలు పరిశీలించారు. దాని ఆధారంగా సాయికుమార్​ఫ్రెండ్స్​అయిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు డీజేలను సీజ్​చేశారు. ఈ సందర్భంగా ఎస్​ఐ గంగాధర్​ మాట్లాడుతూ డీజేలకు పర్మిషన్​ లేదని, అయినా ఈ మధ్య పట్టణాల్లో, గ్రామాల్లో డీజేలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటి విషయంలో సీరియస్​ యాక్షన్​ తీసుకుంటామన్నారు.