కర్మన్​ఘాట్​లో ఫైనాన్స్​ వ్యాపారి హత్య 

కర్మన్​ఘాట్​లో ఫైనాన్స్​ వ్యాపారి హత్య 

దిల్ సుఖ్ నగర్, వెలుగు: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్ లో ఓ వ్యక్తి ఓ యువకుడి చేతిలో హత్యకు గురయ్యాడు. సీఐ సైదిరెడ్డి వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడికి చెందిన బచ్చు వెంకటేశ్వర్లు(47)  కొన్నేళ్లుగా కర్మన్ ఘాట్ లోని ఓ ఎన్​క్లేవ్ లో నివసిస్తూ డైలీ ఫైనాన్స్​నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఇతనికి భార్య దూరంగా ఉంటోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన మామిడి గురువమ్మ భర్త మృతి చెందడంతో కుమారుడు పవన్, కూతురితో కలిసి కర్మన్ ఘాట్ లో నివసిస్తోంది. వెంకటేశ్వర్లు గురువమ్మతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె తన కుమారుడు, కూతురిని మరోచోట అద్దె ఇంట్లో ఉంచింది. 

ఉగాది సందర్భంగా ఆదివారం రాత్రి ఇద్దరూ తమ తల్లి ఉండే ఎన్​క్లేవ్​కు వచ్చారు. వెంకటేశ్వర్లు తల్లీపిల్లలను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో అతనికి, పవన్ కు మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫోన్ చేసి, పవన్ తనను కొడుతున్నాడని చెప్పాడు. వారు సంఘటన స్థలానికి చేరుకునేలోగా పవన్ కత్తితో అతన్ని పొడిచి, పారిపోయాడు. బాధితుడిని ఉస్మానియా జనరల్ హాస్పిటల్​కు తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.