సెల్‌ఫోన్ కోసం ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన ఇద్దరు నిందితులను గుడిమల్కాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 30 తేదీన పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి రోడ్డు పక్కన బిజినెస్ చేసుకుంటున్న సన ఉల్లా వద్దకు వచ్చి ఫోన్ ఇవ్వాలని బెదిరించారు.
దీనికి సన ఉల్లా ఒప్పుకోకపోవడంతో అతనిపై దాడికి దిగారు. అంతేకాకుండా అతని ఛాతీపై పొడిచారు. అనంతరం మొబైల్ తీసుకొని దండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు నిందితుల నుంచి కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తులను గోల్కొండకు చెందిన మహ్మద్ అజీజ్ ఖురేషీ అలియాస్ సోహైల్ (19), 17 సంవత్సరాల వయస్సు గల బాలుడిగా గుర్తించారు. ఈ హత్య కేసు కంటే ముందు ఖురేషీపై ఎనిమిది దొంగతనం, దోపిడీ, హత్యాయత్నం కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసు కమిషనర్ కె శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇలా దొంగిలించబడిన ఫోన్‌లను శ్రీలంక, మలేషియా, సూడాన్‌లకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.