దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మార్నింగ్ వాక్కు వెళ్లిన వ్యక్తిని ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన శనివారం (డిసెంబర్ 7) తెల్లవారుజూమున షాహదారా ప్రాంతంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. షాహదారా డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ష్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ నగర్‌కు చెందిన వ్యాపారవేత్త సునీల్ జైన్ (52) శనివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లాడు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతి సమీపం నుండి సునీల్ జైన్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఈ కాల్పుల్లో సునీల్ జైన్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. క్రైమ్ టీమ్ సంఘటనా స్థలానికి దర్యాప్తు చేపట్టింది. కేసు విచారణ జరుగుతోంది. త్వరలోనే నిందితులను పట్టుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైట్లు పేర్కొన్నారు. తుపాకీ గుండ్ల మోతతో షాహదారా ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు.
Also Read : విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు
దేశ రాజధానిలో శాంతిభద్రతలు విఫలమవుతున్నాయనడానికి ఈ ఘటన మరో ఉదహరణ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖపై విమర్శలు గుప్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీని నాశనం చేశారని.. ఢిల్లీని జంగిల్ రాజ్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఎక్కడ చూసినా ప్రజలు భయానక జీవితాన్ని గడుపుతున్నారని.. ఢిల్లీలో శాంతిభద్రతల నిర్వహణను కేంద్రంలోని బీజేపీ సర్కార్ హ్యాండిల్ చేయలేకపోతుందని విమర్శించారు. ఢిల్లీలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు ఏకం కావాలని.. స్వరం పెంచాలని పిలుపునిచ్చారు కేజ్రీవాల్. కాగా, పాదయాత్రలో భాగంగా ఇటీవల కేజ్రీవాల్ పైన దాడికి యత్నం జరిగిన విషయం తెలిసిందే.