
- అమాయకులను నమ్మించి మంత్రాలు, పూజలు
- పలు గ్రామాల్లో ప్రజల వద్ద రూ. లక్షల్లో వసూలు
- సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆలస్యంగా వెలుగులోకి..
తుంగతుర్తి, వెలుగు: నేను దేశ గురువును.. మీ ఇంట్లో కీడు ఉంది.. మంత్రాలు, పూజలు చేసి తొలగిస్తాను.. అడిగినంత డబ్బులు.. ఆపై యాట పోతును ఇవ్వాలి’’.. అంటూ ఓ వ్యక్తి గుర్రంపై తిరుగుతూ మోసగిస్తుండడం.. సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తి నియోజవర్గంలోని పలు గ్రామాల్లో కొద్దిరోజులుగా దేశ గురువు పేరిట ఒక వ్యక్తి వేషం వేసుకుని, డప్పు చాటింపు చేసుకుంటూ, తెల్ల గుర్రంపై తిరుగుతూ.. ఇంట్లో కీడు ఉందంటూ అమాయక ప్రజలను భయపెడుతూ రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. ఆపై యాట పోతును తీసుకుంటూ దందాకు పాల్పడ్డాడు.
ముందు రోజు ఒక గ్రామానికి వెళ్లి కొందరిని పరిచయం చేసుకుని గ్రామస్తుల వివరాలు సేకరిస్తాడు. మరుసటి రోజు టార్గెట్ చేసిన ఇండ్లకు వెళ్లి దోషం ఉందని, తొలగిస్తానని చెబుతాడు. ఇంట్లోకి వెళ్లి గవ్వలు వేసి కుటుంబ స్థోమతను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. అనంతరం తన వద్ద ఉన్న సామగ్రితో రెండు, మూడు మంత్రాలు చదివి పూజలు చేశానని చెబుతాడు. ఇది ఎవరికైనా చెబితే పని చేయదని, కీడు కూడా సంభవిస్తుందని భయపెడతాడు. నమ్మిన బాధితుల వద్ద ఒక యాట పోతును తీసుకొని తన టాటా ఏస్ వెహికల్ లో వెళ్లిపోతాడు. ఇలా తుంగతుర్తి మండల కేంద్రంలో వారం కిందట ఓ వ్యక్తి వద్ద రూ.73,000, యాట పోతు, మరో10 మంది వద్ద రూ.20 వేల చొప్పున వసూలు చేశాడు.
ఇది బయటకు చెప్తే ఏం కీడు జరుగుతుందోననే భయంతో బాధితులు ఎవరికీ చెప్పడం లేదు. మండలంలోని అన్ని గ్రామాల్లో అతడు దందాకు పాల్పడ్డాడు. ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి వచ్చి వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలిసింది. అమాయక ప్రజల వద్ద రూ. లక్షల్లో వసూలు చేసి మోసగించిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు.