సూర్యాపేట, వెలుగు : గంజాయి అమ్ముతున్న వ్యక్తిని సూర్యాపేట టౌన్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ రవి నిందితుడి వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ సూర్యాపేట జిల్లా తాళ్ల ఖమ్మం పహాడ్ లో నివాసం ఉంటున్నారు. సూర్యాపేటకు చెందిన సిద్ధు, అనోజ్, హైదరాబాద్ కు చెందిన శివ, ఆనంద్ తో అతడికి పరిచయం ఏర్పడింది. వీరంతా కలిసి విశాఖ వద్ద సీలేరులో గంజాయి కొనుగోలు చేసి సూర్యాపేటలో అమ్మేవారు. ఈనెల 4న రాజమండ్రి వద్ద సీలేరులో 10 కేజీల గంజాయి కొనుగోలు చేసి 8న సూర్యాపేటకు చేరుకున్నారు.
కేజీన్నర గంజాయి హరికృష్ణ దగ్గర ఉంచుకోగా, నాలుగున్నర కేజీల గంజాయి సిద్ధు, అనోజ్ వద్ద, మరో నాలుగు కేజీల గంజాయి శివ, ఆనంద్ హైదరాబాద్ కు తీసుకెళ్లారు. హరికృష్ణ తన వద్ద ఉన్న కేజీన్నర గంజాయిని అమ్మేందుకు తాళ్ల ఖమ్మం పహాడ్ నుంచి సూర్యాపేట వైపు బయల్దేరాడు. ఎల్లమ్మ గుడి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా హరికృష్ణ వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. హరికృష్ణ వద్ద కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. మిగతా వారిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.