యువతిని మోసగించిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు

 యువతిని మోసగించిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు
  • ఆసిఫాబాద్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు

ఆసిఫాబాద్, వెలుగు: యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్న కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ మంగళవారం తీర్పు ఇచ్చారు. సీఐ బుద్ధేస్వామి తెలిపిన ప్రకారం.. రెబ్బెన మండలం ఖైరిగూడ గ్రామానికి చెందిన యువతి తన భర్తతో విడాకులు తీసుకొని పుట్టింట్లో ఉంటుంది. ఆమె అన్న వద్దకు అతని ఫ్రెండ్ అదే మండలం దుగ్గాపూర్ గ్రామానికి చెందిన జక్కుల శివ కుమార్ వెళ్తుండేవాడు. 

దీంతో ఆమెతో పరిచయం పెంచుకుని లవ్ చేస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లోబర్చుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు పెండ్లి చేసుకోవాలని శివకుమార్ ఇంటికి వెళ్లి కోరగా.. అందుకు నిరాకరించి బూతులు తిట్టాడు. దీంతో బాధితురాలు 2020 సెప్టెంబర్ 17న రెబ్బెన పీఎస్ లో కంప్లయింట్ చేసింది. 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఎంక్వైరీ రిపోర్ట్ ను కోర్టులో దాఖలు చేశారు. విచారణలో భాగంగా పీపీ జగన్మోహన్ రావు, సీడీఓ, లైజనింగ్ ఆఫీసర్ పి. రాంసింగ్ వాదనలు వినిపించడంతో పాటు సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు శివ కుమార్ కి  జైలు శిక్ష , జరిమానాతో పాటు అతని ముగ్గురు కుటుంబ సభ్యులకు రూ. 5, 200 చొప్పున ఫైన్ విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.