రైలులో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిండు

కోజికోడ్‌‌‌‌: కేరళలో దారుణం జరిగింది. కదులుతున్న  రైలులో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో ఆ కోచ్​లో ఉన్న మరో తొమ్మిది మందికి మంటలు అంటుకుని గాయాలయ్యాయి. ఈ మంటలు చూసిన ఓ కుటుంబం, రైలు నుంచి కిందికి దూకడంతో ప్రాణాలు కోల్పోయింది. మృతుల్లో దంపతులతో పాటు ఏడాది వయస్సు ఉన్న చిన్నారి కూడా ఉంది. ముగ్గురి డెడ్​బాడీలు ఘటన జరిగిన 100 మీటర్ల దూరంలో రైల్వే ట్రాక్​పై పోలీసులు గుర్తించారు. 

అలప్పుజ – కన్నూర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ రైలు ఆదివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో కోజికోడ్‌‌‌‌ సిటీని దాటింది. కోరపుళ రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే డీ – 1 కోచ్​లోని ఓ వ్యక్తి తనవెంట తెచ్చుకున్న బాటిల్​లోని పెట్రోల్ తీసి తోటి ప్రయాణికుడిపై పోసి నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి మరికొంత మందికి అంటుకున్నాయి. మిగిలిన ప్రయాణికులు వెంటనే ఎమర్జెన్సీ చైన్ లాగి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారందరినీ దగ్గర్లోని హాస్పిటల్​కు తీసుకెళ్లారు. కొందరికి 50శాతం గాయాలయ్యాయని, వారి హెల్త్ కండీషన్ స్టేబుల్​గానే ఉందని రైల్వే పోలీసులు వివరించారు. రైలు స్లో అవ్వగానే నిందితుడు పారిపోయాడని తెలిపారు. 

మంటలకు భయపడే..

రైలు కన్నూర్​కు చేరుకోగానే.. ముగ్గురు ప్యాసింజర్లు కనిపించట్లేదని రైల్లో ఉన్నవాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. వెంటనే పోలీసులు ట్రాక్ వెంట సెర్చ్ చేయగా.. ఎల్తూర్ స్టేషన్ దగ్గర్లో మూడు డెడ్​బాడీలను గుర్తించారు. వారి శరీరంపై ఎలాంటి కాలిన గాయాల్లేవని, మంటలు చూసి భయంతో రైలు నుంచి దూకడంతోనే చనిపోయి ఉంటారని పోలీసులు తెలిపారు. నిందితుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆధారంగా నిందితుడి స్కెచ్ గీసి రిలీజ్ చేశామని తెలిపారు. మావోయిస్ట్​ లేదా టెర్రర్ యాంగిల్​లో దర్యాఫ్తు చేస్తున్నామని కేరళ డీజీపీ అనిల్ తెలిపారు.