ములుగు జిల్లాలో పేలిన మందుపాతర..తీవ్రంగా గాయపడిన వ్యక్తి

 ములుగు జిల్లాలో పేలిన మందుపాతర..తీవ్రంగా గాయపడిన వ్యక్తి

వెంకటాపురం, వెలుగు : మందుపాతర పేలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని కర్రె గుట్టల వద్ద శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణమూర్తి, పూసూరి నగేశ్‌‌‌‌, సోడి నరసింహారావు, కుర్సం యడమయ్య కలిసి బాంబూ స్టిక్స్‌‌‌‌ సేకరించేందుకు శుక్రవారం ఉదయం సమీప అడవుల్లోకి వెళ్లారు.

ఈ క్రమంలో వీరభద్రవారం బీట్‌‌‌‌ ముత్యంధార జలపాతం సమీపంలోని కర్రె గుట్టల పైకి వెళ్లారు. ముందు నడుస్తున్న కృష్ణమూర్తి మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలింది. దీంతో కృష్ణమూర్తి ఎడమకాలు నుజ్జునుజ్జు అయింది. గమనించిన మిగతా వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

అనంతరం జోలి కట్టి కృష్ణమూర్తిని వీరభద్రవరం దగ్గరకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న 108లో వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అక్కడ ఫస్ట్‌‌‌‌ ఎయిడ్‌‌‌‌ చేసిన అనంతరం ములుగు హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు.