కొంప ముంచిన పెంపుడు శునకం బర్త్ డే పార్టీ

అహ్మదాబాద్ : కొందరికి పెంపుడు జంతువులంటే చెప్పలేనంత ప్రేమ. వాటిని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ఏటా బర్త్ డేలు సెలబ్రేట్ చేస్తుంటారు. కొందరు కేక్ కట్ చేసి సాదాసీదాగా కానిస్తే మరికొందరు మాత్రం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క పుట్టిన రోజును ధూంధాంగా చేసి అడ్డంగా బుక్కయ్యాడు. 

గుజరాత్ అహ్మదాబాద్కు చెందిన చిరాగ్ అలియాస్ డాగో పటేల్కు ఓ పెంపుడు శునకం ఉంది. అదంటే చిరాగ్కు చెప్పలేనంత అభిమానం.ఈ మధ్యనే ఆ శునకం పుట్టిన రోజును దాదాపు రూ.7లక్షలు ఖర్చు చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు. ఈ వేడుకకు చాలా మంది హాజరయ్యారు. బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫంక్షన్కు అటెండ్ అయిన వారిలో చాలా మంది కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, కనీసం మాస్కులు కూడా పెట్టుకోకపోవడం చిరాగ్ కొంప ముంచింది. ఆ వీడియో తమ దృష్టికి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ ఆంక్షల్ని కఠినతరం చేసింది. ఇలాంటి సమయంలో బర్త్ డేకు పరిమితికి మించి జనాలు రావడం, వచ్చిన వారిలో చాలా మంది కరోనా నిబంధనలు పాటించకపోవడంతో పోలీసులు ఎపిడమిక్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. చిరాగ్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.