- పుణెలోని కాల్ సెంటర్ వద్ద దారుణం.
పుణె: తీస్కున్న అప్పు తిరిగి ఇవ్వలేదన్న కారణంతో తన సహోద్యోగిని ఓ యువకుడు నడిరోడ్డుపైనే కత్తితో నరికి చంపేశాడు. మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఈ దారుణం జరిగింది.
పుణెలోని ఓ కాల్ సెంటర్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శుభదా(28) తండ్రికి చికిత్స అని చెప్పి కొలిగ్ కృష్ణ కనోజా(30) నుంచి పలుమార్లు డబ్బు అప్పుగా తీసుకుంది. కొద్దిరోజులయ్యాక ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని కృష్ణ అడగడంతో అదే కారణం చెప్తూ దాటవేస్తూ వచ్చింది.
దాంతో శుభదా సొంతూరుకు వెళ్లి ఆమె తండ్రి పరిస్థితిపై కృష్ణ ఆరా తీశాడు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని తెలియడంతో శుభదాను మంగళవారం ఆఫీస్ బయటకు పిలిచి నిలదీశాడు. ఇద్దరిమధ్య వాగ్వాదం మొదలైంది.
దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో శుభదాపై దాడి చేయడంతో ఆమె కుప్పకూలింది. చుట్టూ జనం ఉన్నా.. నిందితుడి చేతిలో కత్తి ఉండటంతో ఆపే సాహసం చేయలేదు. నిందితుడు కత్తిని కింద పడేశాకే చుట్టుముట్టి చితకబాదారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా అదేరోజు రాత్రి చనిపోయింది. నిందితుడు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు..