హైదరాబాద్ లో బెంగాల్​ యువతి హత్య

హైదరాబాద్ లో బెంగాల్​ యువతి హత్య

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి గోపన్​పల్లి తండాలో ప్రేమోన్మాది దారుణానికి తెగబడ్డాడు. అనుమానంతో తన లవర్​ను 15 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన ముగ్గురు యువతులపైనా దాడి చేశాడు. అనంతరం సిటీ శివారులోని మొయినాబాద్​ వద్ద కరెంట్ వైర్లను పట్టుకొని నిందితుడు సూసైడ్​కు యత్నించగా, ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. గచ్చిబౌలి పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ ​కుచ్​బీహర్​ జిల్లా లకంపారకు చెందిన దీప్నా తమాంగ్​(26) నగరానికి వలస వచ్చి నల్లగండ్ల అపర్ణా జీనత్​లోని పింక్​ అండ్​ బ్లూ బ్యూటీపార్లర్​లో బ్యూటీషియన్​గా పనిచేస్తోంది. 

ఇదే బ్యూటీపార్లర్​లో పనిచేస్తున్న సావిత్రి, పునితా, కృష్ణ తమాంత్​తో కలిసి గచ్చిబౌలి పరిధిలోని గోపన్​పల్లి తండాలో అద్దెకు ఉంటోంది. ఆమెకు గతంలో వివాహం జరగ్గా, ఒక కుమారుడు ఉన్నాడు. భర్తతో విబేధాల కారణంగా దూరంగా ఉంటోంది. అయితే, గతంలో బెంగళూరులో పనిచేసే సమయంలో బీదర్​కు చెందిన రాకేశ్​(25) తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అనంతరం దీప్నా హైదరాబాద్​కు రాగా, రాకేశ్ కూడా ఇక్కడకు వచ్చి మాదాపూర్​లోని ఓ ప్రైవేట్​ హాస్టల్​లో ఉంటూ మరో బ్యూటీపార్లర్​లో పనిచేస్తున్నాడు.

మరొకరితో సన్నిహితంగా ఉంటుందని...

దీప్నా తమాంగ్​, రాకేశ్​లు మూడేండ్లుగా  ప్రేమించుకుంటున్నారు. కొంత కాలంగా దీప్నా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని రాకేశ్ అనుమానం పెంచుకొని ఆమెతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి11 గంటలకు గోపన్​పల్లి తండాలోని దీప్నా ఇంటికి వెళ్లి మాట్లాడాలని బయటకు పిలిచాడు. మాట్లాడుతున్న సమయంలోనే ఉన్నట్టుండి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితురాలి అరుపులు విని బయటకు వచ్చిన సావిత్రి, పునితా, కృష్ణతమాంగ్​లు రాకేశ్​ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపైనా దాడి చేసి పరారయ్యాడు. 

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు.. దీప్నాతో పాటు ముగ్గురు యువతులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే దీప్నా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమెపై దాదాపు 15 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాకేశ్​ దాడిలో  సావిత్రికి వీపు మీద, పువితకు భుజం, కృష్ణతమాంగ్​కు మణికట్టుపై కత్తి గాట్లు పడ్డాయి. ప్రస్తుతం వీరు ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

ఇదే చివరి రోజు అంటూ తల్లిదండ్రులకు మెసేజ్

ప్రియురాలిపై దాడి చేసిన అనంతరం రాకేశ్​ బీదర్​లో ఉన్న తన తల్లిదండ్రులకు ఇదే తనకు చివరి రోజు అంటూ మెసేజ్ ​పెట్టాడు. దీంతో అతని తల్లిదండ్రులు కర్నాటక పోలీసులను ఆశ్రయించారు. కర్నాటక పోలీసులు ఇచ్చిన సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు రాకేశ్​ ఫోన్​ను ట్రేస్​ చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ​ మొయినాబాద్​ సమీపంలోని కనకమామిడి వద్ద రాకేశ్​ సెల్​ఫోన్​ను గుర్తించి స్థానికంగా గాలించారు. కొద్దిదూరంలో కరెంట్​ వైర్లను పట్టుకొని సగం కాలిన గాయాలతో ఉన్న రాకేశ్​ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.