![కొడుకు వెళ్లే వరకు వెయిట్ చేసి.. స్కూల్ ముందే భార్యను 8 సార్లు పొడిచిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే..](https://static.v6velugu.com/uploads/2025/02/man-stabs-wife-eight-times-near-sons-school-in-bengaluru-surrenders-later_kZuyDoM4IU.jpg)
కొడుకు స్కూల్ లోపలికి వెళ్లే వరకు వేచి చూశాడు. బాబు లోపలికి వెళ్లిపోగానే మాటు వేసిన క్రూర మృగంలా ఒక్క సారిగా విచక్షణా రహితంగా భార్యపై కత్తితో దాడి చేసి చంపేశాడు ఓ భర్త. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 కత్తిపోట్లు పొడిచి అతి దారుణంగా చంపేసిన ఘటన బెంగళూరులోని హెబ్బగోడీ ప్రైవేట్ స్కూల్ దగ్గర జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీగంగ (28), మోహన్ రాజు (32) ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. 8 నెలల క్రితం మనస్పర్దలతో విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారు. కొడుకు శ్రీగంగతోనే ఉంటున్నాడు. రాజు సూపర్ మార్కెట్ లో పనిచేసుకుంటున్నాడు. అయితే భార్యపై అనుమానంతో తరచుగా గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు.
‘‘మంగళవారం (ఫిబ్రవరి4) తన కొడుకును చూడటానికి శ్రీగంగ ఇంటికి వెళ్లిన రాజు.. భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాదన జరిగింది. అయితే బుధవారం ఉదయం బాబును స్కూల్ పంపించేందుకు టూ వీలర్ వెహికిల్ పై వెళ్లింది శ్రీగంగ. అప్పటికే స్కూల్ వద్దకు చేరుకున్న రాజు.. కొడుకు స్కూ్ల్ లోపలికి వెళ్లే వరకు దాక్కున్నాడు. బాబు స్కూల్ లోపలికి వెళ్లగానే భార్య శ్రీ గంగను విచక్షణా రహితంగా పొడిచేశాడు’’ అని పోలీసులు తెలిపారు. అక్కడ ఉన్న వారు వెంటనే శ్రీగంగను ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. భార్యను క్రూరంగా చంపిన రాజు.. ఆ తర్వాత హెబ్బగోడి స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
రాజు తనను తరచుగా వేధిస్తున్నాడని, కొడుకు కోసం వచ్చినట్లుగా వచ్చి తనతో గడవకు దిగుతున్నాడని ఇటీవలే శ్రీ గంగ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్టేషన్ కు పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఇక నుంచి తనను ఇబ్బంది పెట్టనని, ఆమె దగ్గరకు వెళ్లనని పోలీసులకు చెప్పిన రాజు.. మంగళవారం రాత్రి గొడవకు దిగి.. బుధవారం పొద్దున అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేయడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. శ్రీ గంగ మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆక్స్ ఫర్డ్ మెడికల్ కాలేజీకి తరలించారు.