- చెప్పుల దొంగను రిమాండ్‌కు తరలించిన ఉప్పల్ పోలీసులు
ఉప్పల్, వెలుగు: స్థానికులు పట్టుకొని అప్పగించిన చెప్పుల దొంగను ఉప్పల్ పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఇంటిముందు ఉన్న చెప్పులను నిందితుడు ఎత్తుకెళ్లి, ఎర్రగడ్డ మార్కెట్లో రూ.100, రూ.200కు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇటీవల అతని భార్య మద్యం తాగొచ్చి ఉప్పల్ పీఎస్‌లో హల్చల్ చేసినట్లు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్ డివిజన్ శ్రీరామకాలనీలో కొద్దిరోజులుగా ఇంటి ముందు విడిచిన చెప్పులు, బూట్లు కనిపించట్లేదు. దీంతో స్థానికులు నిఘా పెట్టి బుధవారం మధ్యాహ్నం ఈ వింత దొంగను పట్టుకున్నారు. అతని ఇంటికి వెళ్లి సోదా చేయగా, కుప్పలుగా చెప్పులు, బూట్లు కనిపించడంతో షాకయ్యారు.
నిందితుడితోపాటు అతని భార్యను ఉప్పల్ పీఎస్‌కు తీసుకెళ్లి అప్పగించారు. దీంతో విచారించిన పోలీసులు నిందితుడిని పక్కనే ఉన్న వాసవీ నగర్‌కు చెందిన తళారి మల్లేశ్‌గా గుర్తించారు. అతడి భార్య రేణుక ఇటీవల మద్యం మత్తులో స్టేషన్‌కు వచ్చి హల్చల్ చేసినట్లు పేర్కొన్నారు.
మల్లేశ్ రెండు నెలల నుంచి సుమారుగా 100కు పైగా ఇండ్లలో దొంగతనం చేసి సుమారు వెయ్యి జతల చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్లాడు. వాటిని ఎర్రగడ్డ మార్కెట్లో రూ.100, రూ.200కు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.