- వెతుక్కుంటూ వెళ్లి గుర్తించిన కుటుంబీకులు
- బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం ప్రయత్నం
కామారెడ్డి, వెలుగు: ఫారెస్ట్ ఏరియాలో షికారుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రాళ్లగుట్టల సందుల్లో ఇరుక్కుపోయాడు. తలకిందులుగా రాళ్ల మధ్య రాత్రంతా ఉండిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం అతడు గుట్టల్లో చిక్కుకుపోయాడని గుర్తించారు. బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు తరచూ ఫారెస్టు ఏరియాలో షికారుకు వెళ్తుంటాడు. ఉడుములు, ఇతర చిన్నపాటి జంతువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం రాజు షికారుకంటూ వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాలేదు. దాంతో కుటుంబసభ్యులు బుధవారం మధ్యాహ్నం అతడిని వెతుక్కుంటూ ఫారెస్టు ఏరియా లోపలికి వెళ్లారు. తరచూ అతను తిరిగే ప్రాంతాల్లో గాలించారు.
సింగరాయిపల్లి శివారులోని పెద్ద రాళ్ల గుట్ట మధ్యలో నుంచి అరుపులు వినిపించడంతో అక్కడకు వెళ్లారు. లోపలి నుంచి అరుస్తున్న వ్యక్తిని రాజుగా గుర్తించారు. రాళ్ల మధ్య సందులో ఇరుక్కుపోగా.. బయటకు కేవలం కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. బయటకు తీసేందుకు కుటుంబీకులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తాగేందుకు పైనుంచి నీళ్లు పోశారు. ఘటనా స్థలానికి పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్ ఆఫీసర్లు, సిబ్బంది చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్చేపట్టారు. రాళ్లగుట్ట పక్కన జేసీబీతో తవ్వుతున్నారు. రాత్రి 12 గంటల వరకు కూడా బయటకు తీయలేకపోయారు.