- ప్రామిసరీ నోట్ రాయించుకుని టార్చర్ చేస్తున్నరని ఆరోపణ
- వరంగల్ జిల్లా రంగశాయిపేటలో విషాదం
ఖిలా వరంగల్, వెలుగు: కొందరి దగ్గర తాను తీసుకున్న బాకీ కట్టినా వదిలిపెట్టట్లేదని..ప్రామిసరీ నోట్లు రాయించుకుని టార్చర్ పెడ్తున్నారంటూ ఓ యువకుడు డెత్‌నోట్‌రాసి సూసైడ్ చేసుకున్నాడు. నిందితుల పేర్లను మృతుడు డైరీలో రాసుకోగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అతడి భార్య చెబుతోంది. ఆమె కథనం ప్రకారం..వరంగల్ జిల్లా రంగశాయిపేటకు చెందిన వనం రాజ్‌కుమార్ (46) ఫొటోగ్రాఫర్. తన కుటుంబ అవసరాల కోసం కొందరి దగ్గర అప్పు చేశాడు.
అందులో నలుగురి అప్పు తీర్చినా వారు అప్పు ఉన్నట్లు బలవంతంగా మరోసారి ప్రామిసరీ నోట్లు రాయించుకుని ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో మనోవేదనకు గురైన రాజ్‌కుమార్ తనను వేధిస్తున్న నలుగురి పేర్లను డైరీలో రాయడంతో పాటు తాను నిజంగా బాకీ ఉన్న మరో ఇద్దరి పేర్లు కూడా రాశాడు. తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను ఆ ఇద్దరికీ ఇవ్వాలని కోరాడు.
తన డెడ్‌బాడీని కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించాలని పేర్కొన్నాడు. గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సరిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్‌కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నందున నిందితుల పేర్లు చెప్పలేమన్నారు.
అప్పుల బాధతో యువకుడు..
కోనరావుపేట : అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన సావనపెల్లి స్వామి (38) ఆటో నడపడంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. కొన్ని రోజులుగా ఆటో సరిగ్గా నడవకపోవడంతో ఈఎంఐలు కట్టలేదు. దీంతో ఫైనాన్స్ నిర్వాహకులు రెండు నెలల కింద ఆటో తీసుకెళ్లారు.
ఇటీవల స్వామి భార్య పద్మకు హార్ట్ సర్జరీ కావడంతో అప్పులెక్కువయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన స్వామి బుధవారం అర్ధరాత్రి ఇంటి ముందున్న జామ చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య పద్మ, కొడుకు శ్రీహర్ష ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.