ప్రాణం తీసిన ఆన్ లైన్ లోన్
యువకుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆన్ లైన్ లో తీసుకున్న లోన్ కట్టాలంటూ ఒత్తిడి చేయడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన బోనిగే రవీందర్(30) ఉపాధి కోసం దుబాయ్వెళ్లారు. కరోనా కారణంగా అక్కడ పరిస్థితులు బాగాలేకపోవడంతో ఆరు నెలల క్రితం తిరిగి వచ్చేశారు. ఆన్ లైన్ యాప్లో ఆరు నెలల క్రితం రూ.60 వేలు లోన్ తీసుకున్నారు. వారానికి రూ.2,200 ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. సరైన ఉపాధి లేక లోన్ చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు కట్టాలంటూ కొన్ని రోజులుగా ఆన్ లైన్ సంస్థ సిబ్బంది ఫోన్ చేసి ఒత్తిడి చేస్తుండడంతో రవీందర్ గత నెల 30న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు మెట్ పల్లిలోని ప్రైవేట్హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్, అక్కడి నుంచి ఈ నెల 9న హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు చెప్పారు.
For More News..