ఈ మధ్య విద్యార్థినీలను, యువతులను, మహిళలను వేధిస్తున్న ఆకతాయిల సంఖ్య పెరుగుతోంది. చివరకు పాపం పండి అడ్డంగా బుక్కై కటకటాలు లెక్కిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సూరారంలో అమ్మాయిలను, మహిళలను వేధిస్తున్న ఓ వ్యక్తిని చితకబాదారు.
బీఎస్సీ చదివిన నాని అలియాస్ సికిందర్ అనే వ్యక్తి డయాగ్నస్టిక్ సెంటర్ లో జాబ్ చేస్తున్నాడు. కొంతకాలం నుంచి గంజాయికి బానిసై అయ్యాడు. మహిళలు, యువతులను టార్గెట్ చేసుకుని వారిని వేధించడం మొదలుపెట్టాడు. వాట్సాప్ లో అమ్మాయిలకు అశ్లీల మెసేజ్ లతో వేధింపులకు గురి చేస్తున్నాడు. డయాగ్నస్టిక్ సెంటర్ కు వచ్చే వారి ఫోన్ నెంబర్లు తీసుకుని వారికి.. ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడు. విసిగిపోయిన బాధితులు.. వారి బంధువుల సహకారంతో నానిని చితకబాదారు.
విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు నానిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.