బీర్కూర్, వెలుగు: కామారెడ్డి జిల్లా బీర్కూర్మండలంలో తాగిన మైకంలో ఓ తండ్రి తన కూతుర్ని కాలుతున్న గడ్డివాములోకి తోసేశాడు. స్థానికుల కథనం ప్రకారం..మండలంలోని బరంగెడ్గికి చెందిన దేశాయ్పేట్సాయిలుకు ఇద్దరు బిడ్డలు. వీరిద్దరూ ఆదివారం ఇంటి పక్కనే ఉన్న గొట్టల గంగాధర్అనే వ్యక్తి గడ్డివాము దగ్గర ఆడుకుంటున్నారు. అదే సమయంలో గడ్డివాముకు నిప్పంటుకొని దగ్ధమైంది.
సాయిలు కూతురు అంకిత (7)నే గడ్డివాముకు నిప్పంటించిందని గంగాధర్...సాయిలుతో గొడవ పడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయిలు అంకిత వల్లే తను మాటలు పడాల్సి వస్తోందనే ఆగ్రహంతో ఆమెను మంటల్లోకి తోసేశాడు. గంగాధర్ వెంటనే పాపను బయటికి తీసినప్పటికీ ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే 108లో బాన్సువాడ దవాఖానకు తరలించారు. కాగా, దీనిపై తమకు కంప్లయింట్అందలేదని పోలీసులు తెలిపారు.