కూతురితో అసభ్య ప్రవర్తన..కువైట్ నుంచి వచ్చి చంపిండు

కూతురితో అసభ్య ప్రవర్తన..కువైట్ నుంచి వచ్చి చంపిండు
  • ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘటన
  • హత్య తర్వాత వెంటనే కువైట్​కు వెళ్లిపోయిన నిందితుడు
  • అక్కడి నుంచి వీడియో రిలీజ్ చేయడంతో  విషయం వెలుగులోకి..

అమరావతి: తన మైనర్ కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఓ తండ్రి ఏకంగా కువైట్ నుంచి వచ్చి మరీ చంపేశాడు. హత్య అనంతరం వెంటనే తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయడంతో  విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లా  ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో శనివారం తెల్లవారుజామున దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు (59) దారుణ హత్యకు గురయ్యాడు.

పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తానే కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లానని నిందితుడే సోషల్ మీడియాలో  వీడియోను పోస్టు చేయడం సంచలనమైంది. 

అసలేం జరిగిందంటే..!

కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయప్రసాద్ కువైట్​లో ఉంటున్నారు. వారి కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించా డు. ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా.. ఆమె సరిగా స్పందించలేదు.

ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబుల వారిపల్లె పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి, కేవలం మందలించి వదిలేశారు. ఈ విషయాన్ని చంద్రకళ తన భర్తకు వివరించింది. తీవ్ర ఆవేదన కు గురైన అతడు.. కువైట్ నుంచి వచ్చి, శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు.

ఆ వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. హత్య విషయాన్ని బుధవారం సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని.. పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు. చట్ట ప్రకారం న్యాయం జరగకే హత్య చేశానని నిందితుడు పేర్కొన్నాడు.