ముంబై: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. విమాన టికెట్లను రద్దు చేసి తన డబ్బులు వాపస్ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి నుంచి సుమారు రూ. 5 లక్షలు కాజేశారు. మహారాష్ట్రలోని థానేకు చెందిన బాధిత వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి కెన్యాలోని మొంబాసా సిటీకి టూర్ వెళ్దామనుకున్నాడు. దీనికోసం రూ.1.46 లక్షలు చెల్లించి ఈ నెల 29న వెళ్లి, మే 5న రిటర్న్ వచ్చేలా రానుపోను ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు.
అయితే, ఇటీవల టూర్ షెడ్యూల్ మారడంతో టికెట్లు క్యాన్సిల్ చేసుకుని, రీఫండ్ పొందాలనుకున్నాడు. అందుకోసం బాధితుడు గూగుల్‌లో సెర్చ్ చేసి సదరు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లో రీఫండ్ ఫామ్ కూడా నింపాడు. గూగుల్‌లో ఉన్న ఎయిర్‌లైన్ ఫేక్ హెల్ప్ లైన్ కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన సైబర్ నేరగాడు.
ఎయిర్‌లైన్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. డబ్బు రీఫండ్ చేస్తానని నమ్మబలికి బాధితుడితో ఫోన్లో ఓ యాప్ డౌన్‌లోడ్ చేయించాడు. ఆ వెంటనే అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.4.8 లక్షలను కాజేశాడు. తన ఖాతాలో డబ్బు మాయమైందని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.