ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ... వాటి ఆగడాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఆన్లైన్ బెట్టింగ్ కు బలైపోతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అప్పుల ఊబిలో చిక్కుకొని బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడ్డ ఓ యువకుడు దొంగగా మారాడు. వరంగల్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
వరంగల్ కు చెందిన ధర్మరాజు అనే 30 ఏళ్ళ యువకుడు బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడి అప్పులపాలయ్యాడు. బెట్టింగ్ యాప్స్ లో లక్షలు నష్టపోయిన ధర్మరాజు దొంగతనాలకు అలవాటు పడ్డాడు. వరుస చోరీలకు పాల్పడుతున్న ధర్మరాజును మంగళవారం ( అక్టోబర్ 29, 2024 ) పోలీసులు అరెస్ట్ చేశారు.
టెక్నికల్ డేటా ఆధారంగా ధర్మరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుండి 28.50 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ధర్మరాజు వరంగల్ కమిషనరేట్ పరిధిలో 17 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు.