కెనడాలో షాకింగ్ ఘటన: భారతీయ బాలికను రైలు పట్టాలపై నెట్టబోయిన దుండగుడు

కెనడాలో షాకింగ్ ఘటన: భారతీయ బాలికను రైలు పట్టాలపై నెట్టబోయిన దుండగుడు

ఒట్టోవా: ఇటీవల విదేశాల్లో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. జాత్యాంహకార దాడులు, విద్యా సంస్థల్లో విద్యార్థులపై ఎటాక్స్ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, కెనడా దేశాల్లో భారతీయ పౌరులపై ఈ తరహా దాడులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన కొద్ది నెలల్లోనే అమెరికాలో చాలా మంది భారతీయ పౌరులు మృతి చెందారు. ఇదిలా ఉండగానే కెనడాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భారతీయ బాలికపై గుర్తు దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఆ బాలికను ఫ్లాట్‎ఫామ్ మీద నుంచి పట్టాలపై తోసేందుకు ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కానీ పక్కనే ఉన్నవారు ఆ బాలికకు సహయం చేయకపోవడం గమనార్హం. 

ALSO READ | ఖతార్ జైల్లో వడోదరా వాసి.. డేటా చోరీ కేసులో 3 నెలలుగా దోహా జైల్లోనే..

వివరాల ప్రకారం.. కెనడాలోని కాల్గరీ బౌ వ్యాలీ కాలేజ్ రైలు స్టేషన్‌ ప్లాట్‎ఫామ్‎పై ఓ బాలిక నిల్చోని ఉంది. ఈ క్రమంలో నీలం రంగు జాకెట్, ముదురు బూడిద రంగు ప్యాంటు ధరించిన ఓ వ్యక్తి ఆ బాలిక దగ్గరికి వచ్చి ఆమెపై దాడి చేశాడు. బాలిక గొంతు నులిమి.. పక్కనే ఉన్న రైలు పట్టాలపై తోసేందుకు ప్రయత్నించాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో దుండగుడు ఆమెను వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దుండగుడు బాలికపై దాడి చేస్తుండగా.. పక్కనే చాలా మంది ఉన్నప్పటికీ అందులో ఒక్కరు కూడా ఆమెకు సహయం చేసేందుకు ముందుకు రాలేదు. 

బాలికపై దుండగుడు దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దాడికి గురైన అమ్మాయి భారతీయురాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలికపై దాడి చేసిన దుండగుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు బాలికపై దాడి చేసిన దుండగుడు ఎవరు..? ఎందుకు దాడి చేశాడు..? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బాలికపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని భారతీయులు డిమాండ్ చేస్తోన్నారు.