టేకాఫ్ లేటయిందని.. విమానం రెక్కపైకి ఎక్కిండు

మెక్సికో సిటీ:  టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న  విమానం ఎంతసేపటికీ బయలుదేరలేదు. దీంతో చిరాకు పడ్డ ఓ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ తెరిచి విమానం రెక్కపై నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. గురువారం మెక్సికో సిటీ  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. ఏరో మెక్సికోకు చెందిన ఏఎమ్‌672 విమానం గ్వాటెమాలాకు ఉదయం 8.45 గంటలకు బయలుదేరాలి.

కొన్ని కారణాల వల్ల విమానం టేకాఫ్ 4 గంటల పాటు ఆలస్యమైంది. దీంతో అందులో కూర్చున్న ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి విమానం రెక్కపై నడుచుకుంటూ బయటకు వెళ్లాడు. కంగుతిన్న అధికారులు తేరుకుని.. అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.  కానీ, తోటి ప్రయాణికులు మాత్రం ఆ వ్యక్తికి మద్దతు పలికారు. సిబ్బంది తమకు కనీసం మంచినీళ్లు కూడా అందించలేదని చెప్పారు.  ఈ ఘటనపై ఏరో మెక్సికో మాత్రం స్పందించలేదు.