
- ఇండియన్ కరెన్సీకి సౌదీ కరెన్సీ ఇస్తామని..తెల్ల కాగితాలు చేతిలో పెట్టారు..
- కర్చీప్ లు అమ్ముకునే వ్యక్తిని నమ్మి, రూ.2.80 లక్షలు మోసపోయిన బాధితుడు
ఉప్పల్, వెలుగు: ఇండియన్ కరెన్సీ ఇస్తే ఎక్కువ మొత్తంలో సౌదీ కరెన్సీ ఇస్తానని ఆశ చూపి, ఓ వ్యక్తి ఇద్దరు దుండగులు మోసం చేశారు. రూ.2.80 లక్షలు తీసుకొని, చేతిలో పేపర్ కట్టలు పెట్టి బురిడీ కొట్టించారు. ఉప్పల్పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కార్వాన్కు చెందిన మహ్మద్ హైమద్కు అదే ప్రాంతంలో కర్చీప్ లు అమ్ముకునే వ్యక్తి మంగళవారం పరిచయమయ్యాడు.
తన వద్ద సౌదీకి చెందిన నోట్ల కట్టలు 14 బండిల్స్ ఉన్నాయని, వాటి విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.7 లక్షల వరకు ఉంటుందని మాయ మాటలు చెప్పాడు. ఆ తర్వాత ఒక సౌదీ నోటును చూపించి నమ్మించాడు. రూ.2.80 లక్షల ఇండియన్ కరెన్సీ ఇస్తే, తన వద్ద ఉన్న మొత్తం సౌదీ కరెన్సీ ఇస్తానని ఆశచూపాడు. దీంతో బాధితుడు హైమద్ బుధవారం ఉదయం 8 గంటలకు కర్చీప్స్ అమ్ముకునే సదరు వ్యక్తికి ఫోన్ చేశాడు. అయితే, సౌదీ కరెన్సీ ఉప్పల్లో ఉండే తన స్నేహితుడి వద్ద ఉందని అక్కడికి తీసుకెళ్లాడు.
అనంతరం హైమద్ తన కూతురు పెళ్లి కోసం దాచి పెట్టిన డబ్బులను దుండగులకు అందజేశారు. దీంతో దుండగులు ఆ డబ్బును తీసుకొని, న్యూస్ పేపర్లో చుట్టిన బండిల్స్ ను రుమాలులో చుట్టి బాధితుడికి ఇచ్చి జారుకున్నారు. ఆ తర్వాత కొద్ది దూరం వచ్చి బండిల్ విప్పి చూడగా, అందులో తెల్ల కాగితాలు ఉండడంతో కంగుతున్న బాధితుడు వెంటనే ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.