తోడల్లుడిని హత్య చేసిన వ్యక్తి.. వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

తోడల్లుడిని హత్య చేసిన వ్యక్తి.. వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

పెద్దపల్లి, వెలుగు: ఓ వ్యక్తి తన తోడల్లుడిపై కత్తితో దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్‌ (38), ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన వేల్పుల సంతోష్‌ తోడల్లుండ్లు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంతోష్‌.. కుమార్‌కు ఫోన్‌ చేసి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌కు రావాలని కోరాడు. అప్పటికే సంతోష్‌, అతడి భార్య శైలజ అక్కడికి వచ్చారు. మార్కెట్‌ వద్దకు వచ్చిన కుమార్‌తో సంతోష్‌ గొడవ పడ్డాడు.

ఈ క్రమంలోనే సంతోష్‌ తన వద్ద ఉన్న కత్తితో కుమార్‌పై దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయం కావడంతో కుమార్‌ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న డీసీపీ కరుణాకర్‌, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై లక్ష్మణ్‌రావు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే కుమార్‌కు సంతోష్‌ భార్య, తన చెల్లెలు అయిన శైలజతో వివాహేతర సంబంధం ఉందని సంతోష్ అనుమానించే వాడని, ఈ క్రమంలోనే హత్య చేశాడని కుమార్‌ భార్య అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వివాహేతర సంబంధం కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు.