పంత్ను యాక్సిడెంట్ నుంచి కాపాడిన యువకుడు చావుబతుకుల్లో..

పంత్ను యాక్సిడెంట్ నుంచి కాపాడిన యువకుడు చావుబతుకుల్లో..

ముజఫర్నగర్: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ను కారు ప్రమాదం నుంచి కాపాడిన రజత్ కుమార్ అనే యువకుడి జీవితంలో కీలక పరిణామం జరిగింది. రజత్ కుమార్ అతని లవర్ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో రజత్ కుమార్ ప్రేయసి మను కశ్యప్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. రిషబ్ పంత్ను కాపాడిన రజత్ కుమార్ కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఫిబ్రవరి 9న ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లాలోని బుచ్చా బస్తీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రజత్ కుమార్, మను కశ్యప్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ ఇద్దరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకుని ఇద్దరూ విషం తాగారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వీళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే.. మను కశ్యప్ తల్లి మాత్రం తన కూతురిని రజత్ కుమార్ కిడ్నాప్ చేసి విషం తాగించి చంపేశాడని ఆరోపించింది. 

ALSO READ | Badminton Asia Mixed Team Championships 2025 : క్వార్టర్ ఫైనల్లో ఇండియా

2022, డిసెంబర్ 30న ఇండియన్ స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ సమయంలో అతడికి రజత్ కుమార్, నిషు కుమార్ అనే ఇద్దరు యువకులు సహాయం చేశారు. యాక్సిడెంట్ అయ్యాక పంత్ పరిస్థితి విషమంగా ఉందని..అప్పుడు సుశీల్ అనే బస్ డ్రైవర్, కండక్టర్ పరమ్ జీత్ అంబులెన్స్కు ఫోన్ చేశారని ఈ యువకులు తెలిపారు. ఆ సమయంలో ప్రమాదానికి గురైన వ్యక్తి పంత్ అని తమకు తెలియదన్నారు. కానీ అతని ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నించామని చెప్పారు. పంత్ శరీరంపై దుప్పటి వేసి అంబులెన్స్లోకి ఎక్కించామని వివరించారు. ఇలా.. టీమిండియా క్రికెటర్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ ఆత్మహత్యకు యత్నించడంపై పంత్ అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు.