దోసె రెండు రూపాయలకే ఇస్తరా ఎవరైనా? దోసెతో రెండు కుర్మాలు, రెండు చట్నీలు, సాంబారు పెడతరా ఎక్కడైనా? చిన్నతంబి ఇస్తడు.. ఆకలితో నకనకలాడిన రోజుల్ని మర్చిపోకుండా.. తనకు చేతనైనంతలో ఆకలితో బాధపడుతున్నవాళ్ల కడుపునింపు తున్నడు ఈ చెన్నయ్ కాకా. ఆ రుచులు, అక్కడి సంగతుల గురించి అడిగితే ఇట్ల చెప్పిండు.
‘‘మాది తమిళనాడులోని తిరుచ్చి సిటీ. అమ్మ అళగు, నాన్న సాత్యపన్ నా చిన్నప్పుడే చనిపోయారు. ఎనిమిదో తరగతి తర్వాత చదివే అవకాశం లేక, ఒక రెస్టారెంట్లో పని చేయడం మొదలుపెట్టాను. నాకు భార్య వెళ్లయమ్మాళ్, ఇద్దరు పిల్లలున్నారు. నేను పనిచేసిన రెస్టారెంట్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ రేట్లు ఎక్కువగా ఉండేవి. దాంతో పేదవాళ్లు కడుపునిండా తినడం కుదిరేది కాదు.
పేదల కోసమే..
హోటల్ ఇండస్ట్రీ గురించి నాకు బాగా తెలుసు. దాంతో నేను కూడా ఓ చిన్న హోటల్ పెట్టాలనుకున్నాను. ఎక్కువ రేట్లు పెట్టి లాభాలకు అమ్మితే డబ్బులు బాగానే వస్తాయి. కానీ.. నా ఉద్దేశం అది కాదు. పేదవాడు సగం ఆకలితో వెళ్లిపోకూడదన్నది నా ఆలోచన. చిన్నప్పుడు ఆకలితో ఎన్నో రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఆ కష్టం నాకు తెలుసు. అలాగని నాలాగే బాధపడేవాళ్లకి పూర్తి ఉచితంగా తిండి ఎలాగూ పెట్టలేను. అందుకని ఉన్నంతలో చిన్న హోటల్ పెట్టి, తక్కువ రేటుకి పేదవాడి ఆకలి తీర్చాలి అని పించింది. అలా పుట్టిందే 2 రూపాయల దోసె.
అంతా నా కుటుంబమే
ఎలాగో తంటాలుపడి హోటల్ పెట్టాను. ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో చిన్న షాప్ తీసుకున్నాను. రెండు రూపాయల దోసెలతో బిజినెస్ స్టార్ట్ చేశాను. జనం ఫుల్‌గా కనెక్ట్ అయ్యారు. ఇక్కడి వాళ్లే కాకుండా, నా రెండు రూపాయల కాన్సెప్ట్‌కి మెచ్చి వేరే ప్రాంతాల నుంచి కూడా జనం వస్తున్నారు. స్కూల్‌కి పోయే పిల్లలు కూడా వాళ్ల దగ్గర ఉన్న చిల్లర పైసలతో టిఫిన్ చేస్తుంటారు. పది రూపాయలుంటే చాలు కడుపు నిండుతుంది. రెండు కుర్మాలు, రెండు చట్నీలు, ఒక కప్పు సాంబారు ఇస్తాం.
సాయంత్రం ఆరింటికి
ఉదయాన్నే కూరగాయలు, సరుకులు తెస్తా. వాటిని రెడీ చేయడానికే ఒక పూట పడుతుంది. పనంతా ఇంట్లోవాళ్లమే చేసుకుంటాం. సాయంత్రం 6 నుంచి నైట్ 11.30 వరకు బిజినెస్ అవుతుంది. ప్లేట్ దోసె 2, ఇడ్లీ3, ఊతప్పం 4 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. మరో 24 ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అన్నిట్లో దోసెకే గిరాకీ ఎక్కువ. 800 నుంచి వెయ్యి దోసెలు అమ్మిన రోజులున్నాయి. లాక్డౌన్లో ఇబ్బంది పడ్డా, ఇప్పుడు బానే ఉంది.
పాపులర్ అయింది
మా షాప్ చిన్న గల్లీలో ఉంటుంది . కుర్చీలు, బెంచీలు అంత రిచ్‌గా ఉండవు. కానీ వచ్చే వాళ్లకు అవేమీ అక్కర్లేదు. కడుపునిండా తిని వెళ్తారు. ఇక్కడి పిలగాండ్లు యూట్యూబ్‌లో వీడియోలు తీసి పెట్టారు. మా హోటల్ గురించి వార్తల్లో కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత జనం తాకిడి ఎక్కువైంది. చాలామంది సెల్ఫీలు కూడా దిగుతుంటారు. ఇలా జనం ఎక్కువైనప్పుడు పనిచేసేందుకు అసలు టైం సరిపోవట్లేదు. ఏదేమైనా.. అనుకున్నది చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
::: కుప్పిలి సుదర్శన్