బీహార్ ఎంపీ పప్పు యాదవ్‌ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌

బీహార్ ఎంపీ పప్పు యాదవ్‌ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో దేశవ్యాప్తంగా లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌ పేరు మార్మోగిన విషయం విదితమే. బిష్ణోయ్ గ్యాంగ్‌ పేరు వింటేనే రాజకీయ నేతలు భయపడిపోతున్నారని, అతని వద్ద 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని పలు కథనాలు వచ్చాయి. ఆ సమయంలోనే బిష్ణోయ్ గ్యాంగ్‌ పేరుతో..  బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌కు బెదిరింపులు వచ్చాయి. 

పప్పు యాదవ్‌కు కాల్ చేసిన అపరిచిత వ్యక్తి.. సల్మాన్‌ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. కాదని తమ ఆజ్ఞలు ధిక్కరిస్తే చంపడానికి కూడా వెనుకాడబోమని బెదిరించాడు. ఎప్పటికప్పుడు పప్పు యాదవ్‌ కదలికలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపాడు. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆయన పోలీసులను ఆశ్రయించగా.. వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 

ఢిల్లీలో అరెస్ట్

బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని బీహార్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని మహేశ్ పాండేగా గుర్తించిన పోలీసులు.. నిందితుడికి ఏ ముఠాతో సంబంధాలు లేవని తేల్చారు. విచారణలో పాండే నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్‌ స్వాధీనం చేసుకున్నారు. బెదిరింపుల వెనుక ఉద్దేశ్యం ఏమిటో విచారణలో తెలుస్తుందని అధికారులు వెల్లడించారు.