చొప్పదండి ఎమ్మెల్యేను బెదిరించిన వ్యక్తి అరెస్ట్

చొప్పదండి ఎమ్మెల్యేను బెదిరించిన వ్యక్తి అరెస్ట్

కొత్తపల్లి, వెలుగు :  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బెదిరించిన కేసులో నిందితుడిని అరెస్ట్  చేసి రిమాండ్​కు పంపినట్లు కరీంనగర్  రూరల్  ఏఎస్పీ శుభం ప్రకాశ్  తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు గత ఏడాది సెప్టెంబర్  28న రంగారెడ్డి జిల్లా బోడుప్పల్​లోని భవానీనగర్​కు చెందిన యాస అఖిలేష్ రెడ్డి(33) +447886696497 నంబర్​ నుంచి వాట్సాప్  కాల్  చేసి బెదిరించాడు. రూ.20 లక్షలు ఇవ్వాలని లేకపోతే రాజకీయంగా అప్రతిష్టపాలు చేస్తానని, ఇద్దరు పిల్లలు అనాథలయ్యేలా చేస్తానని బెదిరింపులకు దిగాడు. 

దీనిపై ఎమ్మెల్యే కొత్తపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడు లండన్​ ఫోన్​ చేసి బెదిరించినట్లు గుర్తించారు. నిందితుడిపై లుక్  అవుట్  సర్క్యులర్  జారీ చేశారు. ఈ నెల 9న బెంగళూరు ఎయిర్​పోర్టుకు నిందితుడు రాగా, ఇమ్మిగ్రేషన్  అధికారులు అఖిలేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కొత్తపల్లి ఎస్సైకి సమాచారం అందించారు. నిందితుడిని కరీంనగర్  తీసుకొచ్చి, రిమాండ్ కు తరలించారు.