అతని పేరు యాదవ్.. జార్ఖండ్ వాసి.. గ్యాంగ్ స్టర్ గా గుర్తింపు పొందాడు యాదవ్.. 1998లో జరిగిన కుంభమేళాకు ఫ్యామిలీ సహా వచ్చాడు.. ఆ కుంభమేళాలో తప్పిపోయాడు.. కుటుంబ సభ్యులు అందరూ ఎంతో వెతికారు.. పోలీస్ కంప్లయింట్స్ ఇచ్చారు.. ఎక్కడా కనిపించలేదు.. 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే కుంభమేళాలో కనిపించాడు.. ఇది విచిత్రం.. మహా అద్భుతమే అనే చెప్పాలి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కుంభమేళాలోనే ఆసక్తిగా మారిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా..
27 ఏళ్ల క్రితం అదృశ్యమైన గంగాసాగర్ యాదవ్ అనే గ్యాంగ్ స్టర్..ఇప్పుడు మహాకుంభమేళాలో ప్రత్యక్షమయ్యారు.1998లో ధన్‌బాద్ నుంచి అదృశ్యమైన గంగాసాగర్ యాదవ్ అఘోరీ సన్యాసిలా కనిపించారు. మహా కుంభ మేళాకు వచ్చిన బంధువులు గంగా సాగర్ యాదవ్ ను గుర్తించి ఫోటోలు తీసి పంపించడంతో అతని కుటుంబ సభ్యుల్లో ఆశలు చిగురించాయి.
అతని పొడవాటి పళ్లు, నుదిటిపై గాయం ,మోకాలి మచ్చ వంటి లక్షణాలను గుర్తించి గంగాసాగర్ భార్య ధన్వాదేవి, అతని కుమారులు కమలేష్ ,విమలేష్ ,అతని సోదరుడు మురళీ యాదవ్ మేళాకు చేరుకున్నారు.
అయితే, ఇప్పుడు బాబా రాజ్‌కుమార్‌గా పిలువబడుతున్న 65 ఏళ్ల అఘోరీ అయిన గంగాసాగర్.. తన గత జీవితాన్ని తన కుటుంబాన్ని నిరాకరించాడు. తాను వారణాసికి చెందినవాడినని గంగాసాగర్ యాదవ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు.
అతను నిరాకరించినప్పటికీ.. అతనే గంగాసాగర్ యాదవ్ అని కుటుంబసభ్యులు గట్టిగా నమ్ముతున్నారు. కుంభమేళాలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనితో వారి సంబంధాన్ని నిర్ధారించేందుకు DNA పరీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గంగాసాగర్ తల్లి కూడా తన కొడుకును ఎలాగైనా ఇంటికి రావాలని కుటుంబ సభ్యులను కోరింది. కుటుంబమంతా అక్కడే ఉండి గంగాసాగర్ యాదవ్ అని నమ్ముతున్న బాబా రాజ్‌కుమార్‌పై నిఘా ఉంచుతూ కుంభమేళాలోనే ఉన్నారు. DNA పరీక్ష దశాబ్దాల మిస్టరీని వీడుతుందని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.