సర్కార్ బడుల రూపు రేఖలు మార్చేస్తామంటూ చేపట్టిన 'మన ఊరు-మన బడి' పథకం నిధులు లేక పడకేసింది. దీంతో పాఠశాల భవన నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 3,328 పాఠశాల్లలో మన ఊరు-మన బడి పథకం కింద 1,163 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 418 పాఠశాలల్లో ఎంతో ఆర్భాటంగా భవన నిర్మాణాలు ప్రారంభించారు. పనులు ప్రారంభించి స్లాబ్ దశకు రాగానే సర్కార్ నిధులు విడుదల చేయటంలో లేట్ చేసింది. చేసేది లేక కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేశారు. దీంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. విద్యార్ధులకు గదులు లేకపోవటంతో టీచర్లు పాఠశాలల్లో చెట్ల కింద, ఆరు బయట కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు.
విద్యార్ధులకు గదుల కొరత
ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకం కింద ఒక్కో బిల్డింగ్ నిర్మాణానికి 24 లక్షల నుంచి 40 లక్షల వరకు నిధులు కేటాయించారు. ఆ నిధులతో భవనాల నిర్మాణ పనులు మొదట స్పీడుగా జరగాయి. శిధిలమైన భవనాలను తొలగించి....ఆ స్థలాల్లో భవనాలు నిర్మాణాలు చేపట్టారు. దీంతో విద్యార్ధులకు గదుల కొరత తీరుతుందని ఎంతో సంతోషపడ్డారు టీచర్లు. కానీ నిధులు విడుదల కాక పోవటంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపి వేశారు. వరంగల్ నగరంలోని దేశాయిపేట, కృష్ణ్ణ కాలనీ, లేబర్ కాలనీ, హన్మకొండ జిల్లా దామెర మండలం తక్కళ్ల పాడు, డోర్నకల్ మండలం చింత తండాలో పాఠశాల భవన నిర్మాణాలు పునాదుల్లోనే నిలిచి పోయాయి.
ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు
పాఠశాల భవన నిర్మాణ పనులు నిలిచిపోయి నెలలు గడుస్తున్నా... అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాఠశాలల్లో విద్యార్ధులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్ధుల సంఖ్యకు తగ్గట్టుగా గదులు లేక పోవటంతో.. హన్మకొండ జిల్లా హసన్ పర్తి, కమాలపురం మండలం వంగపల్లి,తక్కళ్ల పాడ్ లో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చెట్ల కిందనే కూర్చుని పాఠాలు వింటున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శిథిలావస్థకు పాఠశాల భవనాలు
వరంగల్ జిల్లాలోని దేశాయిపేట పాఠశాలలో భవనాలు శిథిలావస్థకు చేరటంతో పాతవి కూల్చేశారు. వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణం కోసం మన ఊరు-మన బడి కింద 40 లక్షలను మంజూరు చేశారు. భవన నిర్మాణం పనులు ప్రారంభించారు. స్లాబ్ వరకు నిర్మించిన తర్వాత నిధులు మంజూరు కాక పోవటంతో.. పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిధుల కొరత
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, వరంగల్ నగరంలోని లేబర్ కాలనీ, దేశాయిపేట మన ఊరు-మన బడి కింద ఆరు గదులతో రెండు అంతస్థుల భవనాలు, ప్రహరీ గోడ నిర్మాణాలు ప్రారంభించారు. నిధుల కొరత తో పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి. దేశాయిపేటలో స్లాబ్ దశలోనే నిలిచి పోయాయి. ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకం కింద పాఠశాలల భవనాలకు నిధులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు స్పందించి అర్ధాంతరంగా నిలిచిన పాఠశాల భవనాలు పూర్తిచేయాలంటున్నారు.