- వనపర్తి జిల్లాలో 183 స్కూళ్లలో 31 మాత్రమే కంప్లీట్
- సౌలతుల్లేక తిప్పలు పడుతున్న స్టూడెంట్స్
- చెట్ల కింద, వరండాల్లో క్లాసులు
వనపర్తి, వెలుగు: కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామంటూ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు–మన బడి, మన బస్తీ– మన బడి పనులు వనపర్తి జిల్లాలో స్లోగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించి ఏడాది దాటినా పనులు మాత్రం పునాదులు దాటడం లేదు. జిల్లాలో 518 స్కూళ్లు ఉండగా, ఈ స్కీం కింద మొదటి విడతలో 183 స్కూళ్లను ఎంపిక చేశారు. ఏడాది గడిచినా కేవలం 31 స్కూళ్లలో పనులు కంప్లీట్ కాగా, మిగిలిన పనులు పెండింగ్లో ఉన్నాయి.
183 స్కూళ్ల ఎంపిక..
వనపర్తి జిల్లాలో 2022 మార్చి 8న సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మన ఊరు–మనబడి, మన బస్తీ– మన బడి స్కీంను ప్రారంభించారు. జిల్లాలోని 14 మండలాల్లో 518 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో మొదటి విడతలో 183 స్కూళ్లను ఎంపిక చేసి రూ.18.29 కోట్ల ఫండ్స్ కేటాయించారు. క్లాస్ రూమ్స్, మరుగుదొడ్లు, మూత్రశాలలు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్లు వంటి సౌలతులు కల్పించాల్సి ఉంది. వీటిలో రూ.30 లక్షలతో చేయాల్సిన పనులను ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ)ద్వారా, అంతకు మించి ఉన్న పనులు టెండర్ల ద్వారా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టీచర్లకూ కొరతే..
స్కూళ్లల్లో సౌలతులు అంతంతమాత్రంగా ఉండగా, మరోవైపు టీచర్ల కొరత వేధిస్తోంది. అనేక స్కూళ్లల్లో టీచర్ల కొరతతో టెన్త్ ఫలితాలు పడిపోతున్నాయి. నాలుగేళ్లుగా విద్యా వలంటీర్ల నియామకాన్ని ప్రభుత్వం పక్కన పెట్టడంతో, ఉన్న టీచర్లతో చదువులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇంకా కొన్ని స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు అందలేదు. స్కూల్స్ ఓపెనింగ్ వరకు స్టూడెంట్లకు రెండు జతల యూనిఫామ్అందజేయాల్సి ఉన్నా, ఇంకా కుట్టించే పనిలోనే విద్యాశాఖ అధికారులు ఉన్నారు. వనపర్తి జిల్లాకు రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో విద్యారంగ సమస్యలు, స్కూళ్లపై పర్యవేక్షణ కొరవడింది. ప్రస్తుతం నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. దీంతో డీఈవో ఆఫీసు సిబ్బందితో పాటు ఇతర ఆఫీసర్లు మొక్కుబడిగా డ్యూటీలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు, సింగిల్ టీచర్ స్కూళ్లలో సారొచ్చినప్పుడే బడి అన్నట్లుగా మారాయి.
పర్యవేక్షణ పెంచుతాం..
నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు వనపర్తి జిల్లా ఇన్చార్జి బాధ్యతలు కూడా ఉండడంతో పని భారం పెరిగింది. జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లపై పర్యవేక్షణ పెంచుతాం. స్కూళ్లలో చేపట్టిన మనబడి పనులు కంప్లీట్ చేస్తాం. డీఈవో ఆఫీస్ సిబ్బంది, టీచర్లు డ్యూటీ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం.
- గోవింద రాజులు, ఇన్చార్జి డీఈవో, వనపర్తి
స్టూడెంట్లకు తిప్పలు..
సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూళ్లు తెరవడంతో అనేక సమస్యలతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. అమరచింత, ఆత్మకూరు, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపురం, రేవల్లీ, శ్రీరంగాపూర్, పాన్ గల్, పెబ్బేరు మండలాల్లో రిపేర్లు కంప్లీట్ కావడం లేదు. కొన్ని స్కూళ్లల్లో పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేయడం, మరికొన్ని చోట్ల రిపేర్లు ఇప్పుడు ప్రారంభించడంతో స్టూడెంట్లు చెట్ల కింద, వరండాల్లో చదువుకోవాల్సి వస్తోంది. మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీళ్లు, కిచెన్ షెడ్లు లేకపోవడంతో విద్యార్థులు, టీచర్లకు తిప్పలు తప్పడం లేదు.