వేసవి అయిపోతుంది..ఇంకెప్పుడు బాగుచేస్తరు?

వేసవి అయిపోతుంది..ఇంకెప్పుడు బాగుచేస్తరు?

మరి కొన్ని రోజుల్లో విద్యాసంవత్సరం మొదలుకానుంది. సర్కారు చెప్పినట్టు ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఇంగ్లిష్​మీడియం బోధనకు సంబంధించిన ఏర్పాట్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. టీచర్ల బదిలీలు, పదోన్నతులు, నియామకాలు ఎటూ తేలడం లేదు. ఫలితంగా వచ్చే అకడమిక్​ఇయర్​లోనూ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ పనులన్నీ వేసవిలో పూర్తి చేస్తే.. పిల్లలకు ఎలాంటి నష్టం జరగకపోవు.

తెలంగాణ స్వరాష్ట్ర ఆత్మగౌరవ పాలనకు ఎనిమిదేండ్లు కావొస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామన్న ఉద్యమ కాలం నాటి హామీలు ఇంకా నెరవేరలేదు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని, కుల, మత, పేద, ధనిక అనే భేదం లేకుండా ‘కామన్ స్కూల్’ విధానాన్ని అమలు చేస్తామన్నారు. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుఉతన్న పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత, ఇంటర్, డిగ్రీ, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్య వరకు ఎక్కడా సరైన సౌలత్​లు లేవు. బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బదిలీలు, పదోన్నతులు, నియామకాలు లేక విద్యావ్యవస్థలో పర్యవేక్షణ లోపించింది. కరోనా ప్రభావంతో ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లల ప్రవేశాల సంఖ్య పెరిగినప్పటికీ, ప్రభుత్వం వారి సంఖ్యకు సరిపడా మౌలిక వసతులు, ఉద్యోగుల భర్తీ చేయడం లేదు. దీంతో విద్యార్థులు మళ్లీ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలవైపు వెళ్తున్నారు. అక్కడ ఫీజుల దోపిడీ బాగా మితిమీరి పోయింది. దాన్ని అడ్డుకునేవారే లేకుండా పోయారు.

మన ఊరు.. మన బడి

ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే వేసవి సెలవులు గడిచిపోతున్నాయి. ఈ వేసవిలోనే బడులు, కాలేజీలు, వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాల్సి ఉండె. మరి కొన్ని రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతున్నప్పటికీ సర్కారు ఎప్పటిలాగే ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో బడులు శిథిలావస్థలో ఉన్నాయి. చాలా చోట్ల పైకప్పులు పెచ్చులూడి ఎప్పుడు తలమీద పడుతాయో తెలియని పరిస్థితి ఉంది. నెర్రలు బారి కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న గదులు, ప్రహరీలతో పిల్లలు భయం గుప్పిట్లో వెళ్లదీయాల్సి వస్తోంది. మొన్న జరిగిన శాసన సభ సమావేశాల్లో ‘మనఊరు-– మనబడి/ మనబస్తీ –-మనబడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు దీటుగా సర్కారు బడులను బలోపేతం చేస్తామని, వాటిలో సకల సౌకర్యాలు పెంచుతామంది. కానీ బడ్జెట్ లో కేటాయింపులు పెంచలేదు. పైగా దాతల ద్వారా విరాలాలు సేకరించి ప్రభుత్వ కేటాయింపులకు జతచేసుకొని అభివృద్ధి చేసుకోమని చెబుతోంది. మన ఊరు – మన బడి కార్యక్రమానికి సంబంధించి ఎంపిక చేసిన బడుల్లో అకౌంట్ల ఓపెనింగ్, తీర్మానాలు పూర్తయినా.. రాష్ట్రంలో ఎక్కడా పనులు మొదలైన దాఖలాలు లేవు. ఎక్కడో ఓ చోట మంత్రి లేదంటే ఎమ్మెల్యే ప్రారంభ కార్యక్రమాలు మాత్రమే చేపడుతున్నారు తప్పితే పనులు ముందుకు సాగడం లేదు. అకడమిక్​ఇయర్​ప్రారంభమయ్యే నాటికి పూర్తవుడు మాట అటుంచితే.. ఈ ఏడాది ముగిసే లోపైనా పనులు జరగాలని విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు ఆశిస్తున్నారు.

ఇంగ్లిష్​ మీడియం ఎట్ల?

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్​మీడియంలో బోధన ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి టీచర్లకు 9 వారాల శిక్షణ ఖరారు చేసింది. అందులో మొదటి వారం శిక్షణ ఆఫ్​లైన్​లో పూర్తవగా.. మిగిలిన శిక్షణ అజీజ్​ప్రేమ్​జీ వర్సిటీ ఆధ్వర్యంలో ఆన్​లైన్ లో నడుస్తోంది. అయితే ఈ శిక్షణ తూతూ మంత్రంగా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. 20 ఏండ్లు తెలుగు మీడియంలో సర్వీస్​పూర్తి చేసిన టీచర్లు.. ఉన్నపళంగా ఇప్పుడు ఆన్​లైన్​లో శిక్షణ తీసుకొని ఇంగ్లిష్​మీడియం బోధనతో పిల్లలకు ఏమాత్రం న్యాయం చేయగలరన్న ప్రశ్నకు సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. 

టీచర్ల బదిలీలు, పదోన్నతులు..

బదిలీలు, పదోన్నతులు, నియామకాలు లేక విద్యవ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రెగ్యులర్​ఎంఈవోలు, డీఈవోలు, డిప్యూటీ ఈవోలు లేరు. ప్రభుత్వం ఇన్​చార్జిలతో కాలవెళ్లదీస్తోంది. వేల సంఖ్యలో టీచర్​పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు 12 వేల మంది విద్యావలంటీర్లను తొలగించడంతో ఎక్కడా సరిపోను టీచర్లు లేక విద్యార్థులకు నష్టం జరుగుతోంది. రాష్ట్రంలో టీచర్ల ఖాళీల వల్ల విద్యలో నాణ్యతాప్రమాణాలు పడిపోతున్నాయి. విద్యా అధికారులు లేక పర్యవేక్షణ కొరవడి జవాబుదారితనం దెబ్బతింటోంది. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం మంచి ఉద్దేశమే అయినప్పటికీ ఇన్ని ఖాళీల నడుమ ఇలాంటి పరిస్థితిలో ఆశించిన లక్ష్యాన్ని చేరగలమా అన్నది ప్రశ్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో విద్యారంగానికి 14 శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం తగ్గిస్తూ వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. 

కాలయాపన వద్దు..

బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళనలు, వినతులకు స్పందిస్తున్న ప్రభుత్వం.. త్వరలో అంటూ కాలయాపన చేస్తోంది. పండిట్‌‌‌‌, పీఈటీల అప్‌‌‌‌గ్రెడేషన్‌‌‌‌పై కోర్టు వాయిదా జూన్‌‌‌‌ 17న ఉందని, తదుపరి కోర్టు తీర్పును అనుసరించి పదోన్నతులు చేపడుతామంటోంది. పీఎస్‌‌‌‌ హెచ్‌‌‌‌ఎం పోస్టులను 10 వేలకు పెంచుతూ రూపొందించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయని, దీని వల్ల సుమారు25 వేల పైచిలుకు ప్రభుత్వ, పంచాయితీరాజ్‌‌‌‌ టీచర్లు పదోన్నతులు పొందుతారని చెబుతున్నా.. దానిపై స్పష్టత రావడం లేదు. జూన్13న విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఇటు బదిలీలు, పదోన్నతులు.. అటు టీచర్ల రిక్రూట్​మెంట్​జరిగే అవకాశమే లేదు. కోర్టుల్లో ఉన్న కేసులు తేలితే గానీ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేలా లేదు. ఫలితంగా రాబోయే విద్యాసంవత్సరంలోనూ విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది. అకడమిక్​ఇయర్​లో బదిలీలు చేపడితే.. పిల్లలు నష్టపోకుండా ఉండేందుకు, కొత్త టీచర్లను రిక్రూట్​చేసే వరకైనా.. మళ్లీ విద్యావలంటీర్లను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిర్లక్ష్యానికి తెరపడాలె..

ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలన్నా, తెలంగాణ సమాజం ఉన్నత స్థాయికి వెళ్లాలన్నా విద్యను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభుత్వం చిత్త శుద్ధితో పూర్వ ప్రాథమిక విద్య మొదలు ఇంటర్, డిగ్రీ, విశ్వవిద్యాలయ, సాంకేతిక విద్యాలయాల వరకు అన్నింటినీ బలోపేతం చేయాలి. బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయాలి. వాటిల్లో మౌలిక వసతులను, అధునాతన విద్యాబోధన పరికరాలను సమకూర్చాలి. పారిశుద్ధ్య సిబ్బంది కూడా అత్యవసరమని భావించి వారిని నియమించాలి. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ఆంగ్ల మాధ్యమ బోధనకు సరిపడా ఆంగ్ల బోధనోపాధ్యాయుల పోస్టులను సృష్టించి, నియామకాలు చేపట్టాలి. అలా కాకుండా నామమాత్రంగా ఆర్బాటానికి ప్రారంభిస్తే ఇటు తెలుగు, అటు ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరక్క పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారుతుంది. విద్యావ్యవస్థలో దశాబ్దాల నిర్లక్ష్యానికి ఆత్మగౌరవ పాలనలోనైనా తెరపడాలి. - మేకిరి దామోదర్, సోషల్ ఎనలిస్ట్

 

ఇవి కూడా చదవండి

కేర్ తీసుకోకపోతే పిల్లల్లో స్కిన్ ప్రాబ్లమ్స్

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు