నత్తనడకన మన ఊరు- మన బడి పనులు

  •     మార్చి 31 వరకు పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ 
  •      237 స్కూళ్లకు రూ. 80 కోట్లు మంజూరు 
  •      ఇప్పటి వరకు 37 మోడల్ స్కూళ్లు మాత్రమే పూర్తి 


ఆదిలాబాద్, వెలుగు : మన ఊరు మన బడి పనులు ఆదిలాబాద్ జిల్లాలో ముందుకు సాగుతలేవు. ఈ నెల 31 వరకు అధికారులు డెడ్​ లైన్​ పెట్టినా అప్పటిలోగా పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. గతేడాది ప్రారంభమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

పనుల్లో ఆలస్యం... 

మన ఊరు మన బడి పనులు చేసేందుకు స్కూల్ మేనేజమెంట్ కమిటీలు, రూ. 30 లక్షల కు పైగా ఉన్న పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ అప్పగించాయి. పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుండటంతో ఆలస్యం అవుతున్నాయి. అధికారులు 15 రోజులకు ఒకసారి పనులపై సమీక్ష చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. 

సగం కూడా పూర్తికాలె..

జిల్లా వ్యాప్తంగా మన ఊరు మన బడి కింద 237 స్కూళ్లను ఎంపిక చేశారు. కొత్త తరగతి గదులు, కిచెన్ షెడ్, కంపౌడ్ వాల్ నిర్మాణాలు, ఫర్నీచర్, డైనింగ్ హాల్, మరుగుదుడ్లు ఇలా పనుల రకాల పనుల కోసం రూ. 80 కోట్ల నిధులు సైతం మంజూరయ్యాయి. మొదటి దశలో మండలానికి రెండు మోడల్ స్కూల్ ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. అయినా ఇప్పటి వరకు కేవలం 8 స్కూళ్లు మాత్రమే ప్రారంభించారు. మిగతా స్కూళ్లు పనులు పూర్తి కాగా.. ఇంకా ఇనగ్రేషన్ కు నోచుకోవడం లేదు. 200 స్కూళ్లలో 60 నుంచి 70 శాతం పనులు మాత్రమే జరిగాయి. కొన్ని ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టే పనులు ప్రారంభానికే నోచుకోలేదు. చాలా మంది కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేస్తున్నారు. మార్చి 31లోగా పనులు పూర్తి చేయాలని అధికారులు చెప్తున్నా.. పనులు సాగేలా లేవు. 

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. 

అధికారుల పర్యావేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని తెలుస్తోంది. గుడిహత్నూర్, జైనథ్ ఒక్కటిచొప్పున, బోథ్ లో రెండు, భీంపూర్ మండలాల్లో రెండు పాఠశాలలు పనులు పూర్తయ్యే దశలో ఉండగా మిగతా స్కూళ్లలో పనులు 50 శాతం కూడా కాలేదు. కొన్ని స్కూళ్లకు ఇంకా ఫర్నీచర్ రాకపోవడంతో ప్రారంభించడం లేదని తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. 

ఎమ్మెల్యేలు టైం ఇవ్వట్లే..

 పనులు పూర్తయిన మోడల్​ స్కూళ్లను ఎమ్మెల్యేలు ప్రారంభించాల్సి ఉంది. కొన్ని స్కూళ్లను వారు ప్రారంభించినప్పటికీ, మరికొన్న ఇనాగ్రేషన్ చేయడం లేదు. ఒక పక్క మన ఊరు మన బడి పనులు వెనుకబడిపోతుండగా.. పూర్తైన వాటిని కూడా ప్రారంభించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పనులు జరుగుతున్నయి

మన ఊరు మన బడి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నాం. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లోనే కొంత లేట్​ అవుతోంది. ఇప్పటి వరకు 37 మోడల్ స్కూళ్ల పనులు పూర్తి చేసి 8 స్కూళ్లను ప్రారంభించాం. త్వరలోనే మిగతా వాటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 
- ప్రణిత, డీఈఓ