ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు


నిజామాబాద్‌ కలెక్టర్ సి.నారాయణరెడ్డి 

నిజామాబాద్, వెలుగు: ‘మన ఊరు–మన బడి’లో భాగంగా జిల్లాలో చేపట్టిన పనులను గడువులోపు పూర్తి చేయాలని, అలసత్వం చేస్తే ఊరుకోబోమని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో మీటింగ్‌ నిర్వహించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు, మన ఊరు–మన బడి పనులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ఆధునికీకరణ పనులపై రివ్యూ చేశారు. ఆయా పనులకు నిధుల కొరత లేదని, అవసరమైతే అదనంగా నిధులు సమకూరుస్తామని చెప్పారు. దోమల సీజన్ కావడంతో ప్రతి హాస్టల్‌లో కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద జిల్లాకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, సంబంధిత పనులను వేగవంతంగా జరిపించాలని అన్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్ చిత్రామిశ్రా, ఇంజినీరింగ్ విభాగం అధికారులు భావన్న, మురళి, దేవిదాస్, డీఎంహెచ్‌వో డాక్టర్ సుదర్శన్, డీఎస్సీడీవో శశికళ, డీటీడబ్ల్యూవో నాగూరావు, డీపీవో జయసుధ పాల్గొన్నారు.

ఆధార్‌‌ను అప్ డేట్ చేసుకోవాలి

పదేళ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. అప్ డేట్‌పై  ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ తన చాంబర్‌‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్‌‌ను అప్ డేట్ చేసుకోవడంతో పలు ప్రయోజనాలు పొందవచ్చన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు పదేళ్ల కింద ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం తప్పనిసరిగా అప్ డేట్​ కావాలని సూచించారు. కార్యక్రమంలో యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ సహాయ జనరల్ మేనేజర్ శోభన్, ఈ-సేవ జిల్లా మేనేజర్ కార్తీక్, టీఎస్టీఎస్ డీఎం అర్జున్, ఆధార్ కేంద్రాల నిర్వాహకులు షాహిద్, ఖావిన్, లక్ష్మీనారాయణ, నసీర్ పాల్గొన్నారు.

ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వరా..? 

ధర్పల్లి, వెలుగు: అభివృద్ధి పనుల్లో ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వకుండా కొందరు సర్పంచ్‌లు ఒంటెద్దు పోకడలుపోవడంపై సభ్యలు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఎంపీపీ సారికా హన్మంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సభకు జడ్పీటీసీ జగన్, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వకుండా సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. ఇక ముందు సమాచారం ఇవ్వకుండా ప్రోగ్రామ్స్‌ చేస్తే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్‌రెడ్డి, ధర్పల్లి సర్పంచ్‌ ఆర్మూర్ పెద్ద బాలరాజ్, సింగిల్ విండో చైర్మన్లు చిన్నారెడ్డి, రాజేందర్‌‌రెడ్డి, ఎంపీడీవో నటరాజ్​, తహసీల్దార్‌‌ గంగసాగర్, ఎంపీవో రాజేశ్ పాల్గొన్నారు.  

లింగంపేటలో నకిలీ పట్టా కలకలం

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేటలో నకిలీ పట్టా కలకలం రేపింది. రెవెన్యూ ఆఫీసర్ల తప్పిదమా.. లేక కావాలాలనే ఇచ్చారా తెలియదు గాని ఆ పాస్‌ బుక్‌ పొంది వ్యక్తి మాత్రం నాలుగేళ్లుగా రైతుబంధు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం లబ్ధిపొందుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని లింగంపల్లి తండాకు చెందిన సింగిల్‌ విండో కెతావత్ మోతికి 2018లో అప్పటి తహసీల్దార్​గాంధీనగర్ శివారులో సర్వే నంబర్ 370/2లో 4.20 ఎకరాల అసైన్‌మెంట్‌ భూమికి పట్టా ఇచ్చారు. కాగా సదరు భూమి రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్‌‌ 370తో ముస్తాపూర్ గ్రామానికి చెందిన బోరంచ సాయిలు పేరిట ఉంది.

కలెక్టర్‌‌ ఆదేశాలతో...

సింగిల్‌ విండో డైరెక్టర్‌‌ భూమి లేకుండానే నాలుగేళ్లుగా రైతు బంధు, కిసాన్ సమ్మాన్‌ యోజన పథకాలు పొందుతున్నారని పోతాయిపల్లి గ్రామానికి చెందిన టీజీవీపీ లీడర్ అల్లూరి ముదిరాజ్ ఇటీవల కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు విచారణ జరిపి గత నెల 29న నివేదికను అందజేశారు. 2018లో పనిచేసిన తహసీల్దార్​370/2 సర్వే నంబర్ రెవెన్యూ రికార్డులో లేకపోయిన మోతి పేరిట పాసు బుక్‌ జారీ చేశారని ప్రస్తుత తహసీల్దార్‌‌ మారుతి పేర్కొన్నారు. గాంధీనగర్​శివారులో సర్వే నంబర్​ 370లో నలుగురికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డులలో ఉందని, కెతావత్ మోతి పేరిట ఎలాంటి రికార్డులు లేవని వివరించారు. భూమి లేక పోయినా పట్టా పాస్‌ బుక్‌ పొందినట్లు కలెక్టర్‌‌కు నివేదిక పంపారు. కాగా, ముస్తాపూర్ గ్రామానికి చెందిన బోరంచ సాయిలు నుంచి తాను 2015లో 4.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని, తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని విండో డైరెక్టర్ చెప్పారు.

అల్లూరిపై పోలీసులకు పిర్యాదు

నకిలీ పాసు బుక్‌తో రైతు బంధు, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాలు పొందుతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న అల్లూరిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మోతి విలేకరులకు చెప్పారు. అల్లూరి ఆరు నెలలుగా రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్​చేశాడని, ఇవ్వకపోవడంతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. తన కొడుకు ఆరోగ్యం బాగా లేని కారణంగా రెండేళ్లుగా పంటసాగు చేయడం లేదని పేర్కొన్నారు.

మొబైల్ షాపులో దొంగతనం

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: మొబైల్‌ షోరూం ప్రారంభించిన 24 గంటల్లోఅందులో దొంగలు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఆర్మూర్‌‌ రోడ్డులో గురువారం ఉదయం శ్రీతేజ కమ్యూనికేషన్స్ పేరుతో ఏర్పాటు చేసిన మొబైల్‌ షాపును గురువారం ఉదయం యజమాని శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. రాత్రి దుకాణం మూసి వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో దుండగులు షోరూం షెట్టర్లను ధ్వంసం చేసి అందులోని 21 ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఆర్మూర్ రోడ్డులో ఉన్న శ్రీట్రేడర్ పెయింట్ షాపు, జైహనుమాన్ సానిటరీ షాపులో కూడా నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఏసీపీ వెంకటేశ్వర్, నిజామాబాద్ రూరల్ ఎస్సై లింబాద్రి ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. 

పసుపు బోర్డును విస్మరిస్తే బుద్ధి చెబుతాం

ఆర్మూర్, వెలుగు: పసుపు బోర్డు ఏర్పాటును విస్మరిస్తున్న టీఆర్ఎస్, బీజేపీలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని రైతు ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు హెచ్చరించారు. పసుపు బోర్డు ఏర్పాటు తర్వాతే చెప్పులు వేసుకుంటానని 12 ఏళ్లుగా చెప్పులు లేకుండా నడుస్తున్న కమిటీ ప్రతినిధి ముత్యాల మనోహార్‌‌రెడ్డి శుక్రవారం ఆర్మూర్‌‌లో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. రైతు ఐక్య కార్యచరణ, రైతు ఐక్యవేదిక ఆర్మూర్, మెట్‌పల్లి  నాయకులు హాజరై ఆయనకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో రైతు ఐక్య కార్యచరణ నాయకులు వి.ప్రభాకర్, దేగాం యాదాగౌడ్, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లింగారెడ్డి, మంథని గంగన్న, ఏఐకేఎంఎస్ నాయకులు బి.దేవరాం, కార్యదర్శి పి.రామకృష్ణ, ఎస్.సురేశ్‌, పిప్పిరి గంగన్న, రాజన్న పాల్గొన్నారు.  

అశ్రునయనాల మధ్య రాజమ్మకు వీడ్కోలు

భిక్కనూరు, వెలుగు: కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తల్లి గంప రాజమ్మ మృతితో బస్వాపూర్‌‌ శోకసముద్రంలో మునిగింది. అశ్రునయనాల మధ్య శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. రాజమ్మ మరమణ వార్త తెలుసుకున్న స్పీకర్‌‌ పోచరం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆర్అంద్‌బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్​షిండే, సురేందర్‌‌, కామారెడ్డిమున్సిపల్ చైర్ పర్సన్ జహ్నవి, కామరెడ్డి బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి వెంకట్‌రెడ్డి, వేణుగోపాల్‌గౌడ్‌లతో పాటు పలువురు బస్వాపూర్‌‌ చేరుకుని ఆమె పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. విప్‌ గోవర్ధన్‌, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారితో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్​ఎడ్ల రాజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్‌రెడ్డి, ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీసీటీ పద్మ నాభూషణంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, సర్పంచ్‌లు తునికి వేణు, మధుమోహన్‌రెడ్డి, నర్సింహులు యాదవ్, రాజమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

‘రెచ్చగొట్టే పనులు మానుకోవాలి’

భిక్కనూరు, వెలుగు: గ్రామస్తులను రెచ్చగొట్టె పనులు మనుకోవాలని డీసీసీబి డైరెక్టర్ జంగంపల్లి విండో చైర్మన్‌ గొండ్ల సిద్దరాములు పలువురికి సూచించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన కొత్త నర్సింహులు కొందరు గుండాలతో కలిసి జంగంపల్లి ప్రజలను రెచ్చగొడుతూ గొడవలకు దిగుతున్నారని మండిపడ్డారు. గ్రామంలోని కొంత ప్రభుత్వ భూమిలో ప్రతి సంవత్సరం రైతులు వడ్లను అరబెట్టుకుని కాంట చేసుకుంటారన్నారు. నర్సింహులు ఆ భూమిని నిరుపేదల ఇండ్లకు కేటాయించిన స్థలం అంటూ 200 మందిని పోగు చేసుకుని ఒక్కరి వద్ద రూ.4 వేల వరకు వసూలు చేసి గుడిసెలు వేయించారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే తహసీల్దార్‌‌ దృష్టకి తీసుకెళ్లామని చెప్పారు. సమావేశంలో సిద్దరాములు, నర్సింలు, నర్సాయ్యలు ఉన్నారు. 

సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

ధర్పల్లి, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ జగన్, ఎంపీపీ సారికా హన్మంత్‌రెడ్డి సూచించారు. మండలంలోని ధనంబండ తండాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వారు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం రూ.2,060ల మద్దతు ధర ఇస్తున్నట్లు చెప్పారు. సింగిల్​ విండో చైర్మన్ చిన్నారెడ్డి, ధర్పల్లి సర్పంచ్‌ ఆర్మూర్​పెద్ద బాలరాజ్, టీఆర్ఎస్​ సీనియర్ నాయకుడు పుప్పాల సుభాష్, ధనంబండ తండా సర్పంచ్‌ నరేందర్, ఎంపీటీసీ స్వామి పాల్గొన్నారు. 

ఘనంగా పోచమ్మ బోనాలు

బీర్కూర్, వెలుగు: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్‌‌లో శుక్రవారం పోచమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. పాడి పంటలు సంవృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.