భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని మూడు మండలాల్లో మన ఊరు– మనబడి పనులు ముందుకెళ్లడం లేదు. అవసరం మేర నిధులు కేటాయించక పోవడం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో స్కూళ్లలో సమస్యలు పరిష్కారం కావడం లేదని అంటున్నారు. పనులు చేసినా బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగానికి చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి మండలాల్లో స్కూళ్లను కేటాయించారు. చర్లలో 23, దుమ్ముగూడెంలో 27, ములకలపల్లిలో 18 స్కూళ్లను ఫస్ట్ ఫేజ్‌లో సెలెక్ట్ చేశారు. వీటిలో 212 పనులకు రూ.8,29,78,212 అవసరమని ప్రతిపాదించారు. పెద్ద పనులకు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సి ఉండగా, చిన్న పనులను నామినేటెడ్ పద్ధతిలో కేటాయించారు. వాటర్ ట్యాంకులు, రంగులు, కరెంట్, తలుపులు, కిటికీలు, ర్యాంపులు, స్లాబ్, ప్యాచ్ వర్కులు ఇలాంటి పనులు చేపట్టాల్సి ఉంది.
ఒక్కో చోట ఒక్కో కారణం..
ములకలపల్లి మండలంలో 18 స్కూళ్లను సెలెక్ట్ చేశారు. హైస్కూల్‌కు రూ.39.66 లక్షలు కేటాయించడంతో టెండర్లు నిర్వహించారు. దీంతో ఇక్కడ పనులు స్టార్ట్ కాలేదు. 15 స్కూళ్లలో హెచ్ఎం, విద్యాకమిటీ చైర్మన్, ఏఈలతో కూడిన జాయింట్ బ్యాంకు అకౌంట్ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. అకౌంట్ లేదనే కారణంతో మామిళ్లగూడెం స్కూల్లో పనులు జరిగినా బిల్లులు ఇవ్వడం లేదని అంటున్నారు. అకౌంట్లు ఓపెన్ కాక, అడ్వాన్సులు రాక పనులు సాగడం లేదు. చర్ల మండలంలో రెండు స్కూళ్లకు మాత్రమే అడ్వాన్సులు పడ్డాయి. మిగిలిన వాటికి పడలేదు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినా నిధులు రావడం లేదని కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. దుమ్ముగూడెం మండలంలో ఒక్క పనికీ అడ్వాన్సులు రాలేదు. నర్సాపురం హైస్కూల్‌కు రూ.38లక్షలు కేటయించడంతో టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించాలి. పర్ణశాల, కొత్తమారేడుబాక స్కూళ్లలో ఇంకా పనులు షురూ కాలేదు. చిన్న చిన్న పనులు మాత్రమే చేసి బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు 15 నుంచి 20 శాతం మాత్రమే బిల్లులు ఇస్తామని కలెక్టర్అంటున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇలా బిల్లుల మంజూరులో ఆలస్యం చేయడం వల్ల మన్యంలోని చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి మండలాల్లో మన ఊరు–-మనబడి స్కీమ్ పనులు ముందుకు సాగడం లేదు.
పనులు పూర్తి చేసినా బిల్లులు రాలే..
మామిళ్లగూడెం ప్రాథమిక పాఠశాలలో రూ.7.35లక్షల పనులు చేసినా బిల్లులు రాలేదు. ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్ ఓపెన్ కాకపోవడంతో ఈ పరిస్థితి ఉంది. పనులు చేసేందుకు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టుకుంటున్నాను.
- పుప్పాల చంద్రరావు, ములకలపల్లి
పనులు జరుగుతున్నాయ్..
గోదావరి వరదలు, వర్షాల వల్ల మన ఊరు--------–మనబడి పనులు ఆలస్యమయ్యాయి. దుమ్ముగూడెం మండలంలో పనులు స్టార్ట్ చేసినం. పర్ణశాల,కొత్తమారేడుబాకలో పనులు ప్రారంభం కాలేదు. నర్సాపురంలో టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభిస్తాం. అడ్వాన్సులు పడకపోయినా కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు మొదలుపెట్టినం.
- వెంకటేశ్వర్లు, ఏఈ, ఐటీడీఏ