జనగామ అర్బన్, వెలుగు : అయ్యప్ప మాల వేసుకున్నాడని స్టూడెంట్ ను స్కూల్ యాజమాన్యం లోపలికి రానివ్వలేదు. జనగామ జిల్లా కేంద్రంలో సెయింట్ పాల్ హైస్కూల్లో శనివారం ఈ ఘటన జరిగింది. అయ్యప్ప మాల వేసుకున్న స్టూడెంట్ ను యాజమాన్యం లోనికి రానివ్వలేదని తెలియడంతో ఏబీవీపీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. ఏబీవీపీ జనగామ జిల్లా కన్వీనర్ తోట హృతిక్ సాయి మాట్లాడుతూ.. మాల వేసుకున్న ఐదో తరగతి స్టూడెంట్‌ను సెయింట్ పాల్ యాజమాన్యం మాల తీసివేసి యూనిఫాంలో రావాలని ఎండలో నిల్చోబెట్టి అవమానించిందన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన జీఓను దృష్టిలో పెట్టుకొని మాలధారణలో ఉన్న స్టూడెంట్లను అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా ఈ స్కూల్ యాజమాన్యం స్టూడెంట్లు బొట్టు పెట్టుకోకూడదని, గాజులు ధరించరాదని నిబంధనలు పెట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఆయన తెలిపారు. డీఈఓ వెంటనే స్పందించి స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. జనగామ సీఐ శ్రీనివాస్ చొరవతో స్కూల్ ప్రిన్సిపాల్ క్షమాపణ చెప్పడంతో ధర్నా విరమించారు.