తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు ఇటీవలే సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ నిబంధన ప్రకారం మొత్తం 12 రోజులు సెలవులివ్వాలని సూచించింది. కానీ ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ ఖమ్మంలోని కొన్ని విద్యాసంస్థలకు తరగతులు నిర్వహిస్తూ పాఠశాలలను యథావిధిగా నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారంటూ కొందరు జిల్లా అధికార యంత్రాంగంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 26నుంచి అక్టోబర్ 9 వరకు విద్యాసంస్థలకు సెలవులివ్వాలని ఆదేశించింది. అయితే ఆ నిబంధనను కుదించాలని కోరుతూ ఇటీవల విద్యాశాఖకు, NCERT లేఖ రాసింది. జులైలో కురిసిన వర్షాలు, సెప్టెంబర్ 17న పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పని దినాలు తగ్గాయని ఎన్సీఈఆర్టీ లేఖలో పేర్కొంది. వీటిని భర్తీ చేసేందుకు ఈ సెలవులను తగ్గించాలని కోరింది. అనంతరం విద్యాశాఖ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ముందుగా ఇచ్చిన ప్రకటన ప్రకారమే సెలవులు అమలు చేయాలని ఆదేశించింది. దీనిపై రెండవ అభిప్రాయం లేదని తేల్చి చెప్పింది.