ఏసీబీకి చిక్కిన పరిశ్రమల శాఖ మేనేజర్

  • సిరిసిల్లలో రూ.13 వేలు తీసుకుంటూ పట్టుబడిన ఉపేందర్ రావు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల పరిశ్రమల శాఖ మేనేజర్ ఉపేందర్ సోమవారం ఏసీబీకి చిక్కాడు. ఓ మహిళ వద్ద రూ.13వేలు లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన భూక్యా సరిత సబ్సిడీ కింద టిప్పర్ తీసుకున్నారు. అయితే, ఆ సబ్సిడీకి సంబంధించి వెరిఫికేషన్ జరుగుతోంది. కానీ, సబ్సీడీ రావాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఉపేందర్ రావు డిమాండ్​చేశాడు.

దీంతో సరిత ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం సిరిసిల్లలోని గీతానగర్  జడ్పీ హైస్కూల్​లో ఉపేందర్​రావు ఎలక్షన్ డ్యూటీలో ఉండగా భూక్య సరిత మరిది వెంకటేశ్ అతడికి ​కాల్ చేశాడు. దీంతో బయటకు వచ్చి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేశామని, నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణ మూర్తి తెలిపారు.