వెలుగు బిజినెస్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ముకేశ్ అంబానీ 1:1 ప్రాతిపదికన వాటాదారులకు బోనస్ షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. బోనస్ ఇష్యూ సెప్టెంబర్ 5 నుంచి అమలులోకి వస్తుందని ఇటీవల జరిగిన ఏజీఎంలో తెలియజేశారు. బోనస్ ఇష్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక కంపెనీ తన పేరుకుపోయిన నిల్వలు లేదా లాభాలను ఉపయోగించి ఇప్పటికే ఉన్న వాటాదారులకు అదనపు షేర్లను జారీ చేయడాన్ని బోనస్ ఇష్యూ లేదా బోనస్ షేర్ ఇష్యూ అంటారు. ఉదాహరణకు, ఒక రిలయన్స్ వాటాదారు కంపెనీకి చెందిన 100 షేర్లను కలిగి ఉంటే, కంపెనీ వారికి బోనస్ ఇష్యూలో 100 అదనపు షేర్లను ఇస్తుంది.
కంపెనీలు తమ స్టాక్‌ను రిటైల్ పెట్టుబడిదారులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి బోనస్ షేర్లను జారీ చేస్తాయి. ప్రత్యేకించి షేర్ ధర గణనీయంగా పెరిగినప్పుడు ఇలా షేర్లను ఉచితంగా ఇస్తాయి. మొత్తం షేర్ల సంఖ్యను పెంచడం ద్వారా, కంపెనీ ఒక్కో షేరు ధర తగ్గుతుంది. ఇది చిన్న పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బోనస్ షేర్లు నమ్మకమైన వాటాదారులకు బహుమతిగా కూడా పనిచేస్తాయి. భవిష్యత్ లాభదాయకతపై కంపెనీ విశ్వాసాన్ని సూచిస్తాయి.
వాటాదారులకు ఏం లాభం ?
బోనస్ ఇష్యూ వల్ల ఆర్‌ఐఎల్ షేర్‌హోల్డర్‌లకు, పెట్టుబడిదారులకు ఎలాంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండానే షేర్లు రెట్టింపు అవుతాయి. రిలయన్స్ వాటాదారులకు గతంలో చాలాసార్లు బోనస్ షేర్లను జారీ చేసిన చరిత్ర ఉంది. మునుపటి బోనస్ ఇష్యూలు 1980, 1983, 1997, 2009, 2017లో జరిగాయి. పెట్టుబడిదారులతో దాని విజయాన్ని పంచుకోవడానికి అదనపు షేర్లను ఇస్తారు.
ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. స్టాక్ లిక్విడిటీని పెంచుతుంది. బోనస్ఇష్యూ వల్ల ప్రతి పెట్టుబడిదారుడి షేర్ల సంఖ్య పెరుగుతుంది కానీ పెట్టుబడి మొత్తం విలువ మారదు. ఎందుకంటే కొత్త షేర్ల సంఖ్యను ప్రతిబింబించేలా షేరు ధరల్లో మార్పులు ఉంటాయి. కాబట్టి వారి హోల్డింగ్‌ల మొత్తం విలువ అలాగే ఉంటుందని, షేర్ ధర సగం వరకు తగ్గుతుందని ఎనలిస్ట్‌లు పేర్కొన్నారు.