
కరీంనగర్, వెలుగు : పోలీస్‌స్టేషన్‌లో తానేం చేసినా చెల్లుబాటవుతుందని, తనకు అడ్డెవరన్నట్లుగా వ్యవహరించిన మానకొండూరు సీఐ ఇంద్రసేనారెడ్డిపై కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి వేటు వేశారు. మూడు రోజుల కిందట మానకొండూర్ పోలీస్ స్టేషన్ లో ఓ ప్రైవేటు వ్యక్తి (కాంట్రాక్టర్) పుట్టిన రోజు వేడుకలు జరిపిన తీరు వివాదాస్పదమైంది. సీఐ ఏకంగా తన చాంబర్ లో వేడుకలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘వెలుగు’లో కథనం వచ్చింది. స్పందించిన సీపీ చర్యలకు ఉపక్రమించారు. సీఐని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ మహిళ ఠాణాలో సీఐగా పనిచేస్తున్న సంతోష్ కుమార్ కు ఇన్‌చార్జీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
టపాకాయలు.. మిఠాయిలు
మనసుకు ఏదైనా మంచి జరిగిందని తెలిసినపుడు సాధారణంగా వేడుకలు చేసుకుంటాం. గ్రామాల్లో వేడుకల సమయాల్లో… నాయకులు గెలిచినపుడు టపాకాయలు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసుకుంటారు. కానీ మానకొండూరులో ఇన్ని రోజులు పనిచేసిన సీఐ ఇంద్రసేనా రెడ్డిని సీపీ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారనే వార్త తెలియగానే స్థానికులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. అంటే సదరు పోలీసు అధికారి ప్రభావం స్థానికులపై ఎంతమేరకు ఉందో తెలుస్తోంది. సాధారణంగా ఎవరైనా అధికారి బదిలీపై వెళ్తున్నా, పదవీ విరమణ చేసినా అక్కడి ప్రజలు సన్మానాలు, సత్కారాలుచేసి వీడ్కోలు పలుకుతారు. కానీ మానకొండూరులో ఇందుకు భిన్నంగా సాగనంపారు. సీఐని విధుల నుంచి తప్పిస్తూ కమిషనరేట్ కు అటాచ్ చేస్తున్నారని తెలియడంతో మండలంలో సోషల్ మీడియాల్లో అతనికి సంబంధించిన అవినీతి ఆరోపణలు చక్కర్లు కొట్టాయి. కేవలం అటాచ్ చేయడంతో సరిపుచ్చుకోకుండా లోతైన విచారణ చేయాలని సర్కిల్ పరిధిలోని సామాన్యులు వారి ఆవేదన వెళ్లబోసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.