3 కోట్ల విలువైన బంగారంతో మణప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ జంప్ !

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. మణప్పురం గోల్డ్ లోన్ ఆఫీస్లో ఉన్న బంగారాన్ని మేనేజర్ విశాల్ ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. మణప్పురం గోల్డ్ లోన్ ఆఫీస్లో 3 కోట్ల 25 లక్షల రూపాయల విలువైన బంగారంతో మేనేజర్ ఉడాయించాడు. ఈ విషయం తెలిసి కస్టమర్లు తీవ్ర ఆందోళన చెందారు. 

వికారాబాద్ మణప్పురం గోల్డ్ కార్యాలయం దగ్గరకు కస్టమర్లు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బ్రాంచ్కు చేరుకొని మేనేజర్ ఎక్కడికెళ్లాడో చెప్పాలని మణప్పురం సిబ్బందిని కస్టమర్లు నిలదీశారు. దాదాపు మూడు కేజీల బంగారం ఎత్తుకెళ్లాడని సిబ్బంది చెప్పారు. ఈ ఘటనతో బాధితులు లబోదిబోమంటున్నారు.

వడ్డీ తక్కువ అని జనం మణప్పురం, ముత్తూట్​ ఫిన్​ కార్ప్​, ముత్తూట్​ మినీ, ఐఐఎఫ్​ఎల్​లాంటి నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ కంపెనీల్లో గోల్డ్​ లోన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కో బ్రాంచ్లో రోజూ 20 తులాలకు పైగా బంగారం తాకట్టు పెడుతున్నారు. గతంలో ఇది 10 తులాల కన్నా తక్కువే ఉండేది. 

అన్ని కంపెనీలకు కలిపి హైదరాబాద్లో వెయ్యికి పైగా బ్రాంచ్లు ఉన్నాయి. ఈ లెక్కన రోజుకు 20 వేల తులాల బంగారాన్ని జనం తాకట్టు పెడుతున్నారు. అంటే 200 కిలోల బంగారం అనమాట. పైసాపైసా కూడబెట్టుకొని కొనుక్కున్న బంగారమే కష్టకాలంలో అక్కరకు వస్తుంది. కొందరైతే పరిస్థితులు అనుకూలించక పుస్తెల తాడును కూడా తాకట్టు పెడుతుంటారు. అలాంటి బంగారాన్ని వికారాబాద్ మణప్పురం బ్రాంచ్ మేనేజర్ గద్దలా తన్నుకుపోవడంతో కస్టమర్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.