
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో టెకీ ఆత్మహత్య కేసులో అతని భార్య, మామను పోలీసులు అరెస్ట్ చేశారు. టెకీ మానవ్ వర్మ ఆత్మహత్య అనంతరం గుజరాత్ పారిపోయిన అతని భార్య నికితా శర్మ, మామ నృపేంద్ర శర్మలను పోలీసులు అహ్మదాబాద్ లో అరెస్ట్ చేశారు. గతంలో వీరిద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
అంతేకాదు వీరిని పట్టుకుంటే 10వేల రివార్డు ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన తండ్రీకూతుళ్లతోపాటు మరో నిందితుడికోసం వివిధ ప్రాంతాల్లో సెర్చింగ్ చేసిన పోలీసులు చివరికి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నికితా శర్మ, నృపేంద్ర శర్మలను అదుపులోకి చేశారు. ఈ కేసులో అనేకసార్లు నోటీసులు జారీ చేసినా నికితా, ఆమె తండ్రి పోలీసుల ముందు హాజరు కాకపోవడంతో మార్చి 13న ఆమె తల్లి, సోదరుడిని అరెస్ట్ చేశారు.
మానవ్ ఆత్మహత్యకు సంబంధించిన అతని భార్య, ప్రధాన నిందితురాలు నికితా కీలక వ్యాఖ్యలు చేస్తూ గతంలో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మానవ్ తనను వేధించేవాడని.. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తరుచు గొడవలు పడేవాడని ఆరోపించింది. అయితే మొదటి వీడియో తర్వాత కొన్ని రోజులకు మరో వీడియో విడుదల చేసింది. అందులో ఆమె మానవ్ కు క్షమాపణలు చెప్పినట్లు కనిపిస్తోంది..
తేదీ లేని ఈ వీడియోలో తనకు వివాహానికి ముందు అభిషేక్ అనే వ్యక్తితో లైంగిక సంబంధం ఉన్నట్లు ఒప్పుకున్నట్లు వీడియోలో ఉంది. తన మామ కూడా తనపై లైంగిక దాడికి యత్నించినట్లు తెలిపింది. తన వివాహబంధాన్ని కొనసాగించేందుకు తాను ఎన్నడూ ఈ విషయాన్ని మానవ్ కు చెప్పలేదని వీడియోలో నికితా శర్మ చెప్పినట్లు ఉంది.
మానవ్ శర్మ ఆత్మహత్య తర్వాత మానవ్ కుటుంబ సభ్యులు అతని భార్య ,అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విడాకుల విషయంలో అతన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మానవ్ మృతిచెందిన తర్వాత పరారీలో ఉన్న నికితాతో సహా ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో నికితా, ఆమె తండ్రికోసం వెదికిన పోలీసులు.. చివరికి అహ్మదాబాద్ లో అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది.