![సర్పంచ్‌ను వేలం ద్వారా కాదు.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలి : ఎంపీడీవో భాస్కర్](https://static.v6velugu.com/uploads/2025/02/manavapadu-mpdo-bhaskar-suggested-that-sarpanch-should-be-elected-democratically-not-through-auction_6r9NflDhbO.jpg)
- సర్పంచ్ పదవి @ 27 లక్షలు’ వార్తకు స్పందించిన ఆఫీసర్లు
- గ్రామానికి వెళ్లి వివరాలు తెలుసుకున్న మానవపాడు ఎంపీడీవో
గద్వాల, వెలుగు : సర్పంచ్‌ను వేలం ద్వారా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలని మానవపాడు ఎంపీడీవో భాస్కర్ సూచించారు. ‘సర్పంచ్ పదవి @ 27 లక్షలు’ అనే హెడ్డింగ్‌తో సోమవారం ‘వెలుగు’లో వార్త పబ్లిష్ కావడంతో స్పందించిన ఎంపీడీవో సోమవారం ఉదయం గోకులపాడు గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలం పాట ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకోవడం తగదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలంతా ఓట్లు వేసి సర్పంచ్‌ను ఎన్నుకోవాలని సూచించారు.
వేలం పాట ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకుంటే చట్టాలు ఒప్పుకోవన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ శివాలయ నిర్మాణం కోసమే మాట్లాడుకున్నామని, అదే విధంగా గొర్రెల వేలం పాటే నిర్వహించాం తప్ప ఇతర ఏ వేలం నిర్వహించలేదని ఆఫీసర్లకు చెప్పారు. గ్రామసభలో పంచాయతీ సెక్రటరీ రాధిక, మాజీసర్పంచ్ నరసింహులు, సంజీవులు, శేషన్న, రామాంజనేయులు పాల్గొన్నారు. కాగా ఆదివారం నిర్వహించిన సర్పంచ్ వేలంపాటలో పాల్గొన్న వ్యక్తులు గానీ, వేలంలో సర్పంచ్ పదవి దక్కించుకున్న వ్యక్తి గానీ గ్రామసభకు హాజరుకాకపోవడం గమనార్హం.