ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి : కలెక్టర్ బదావత్ సంతోష్

నస్పూర్, వెలుగు : ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం జిల్లాలోని కటెక్టరేట్​మీటింగ్​ హాల్​లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కారణంగా తమకు ఉపాధి లేకుండా పోయిందని, తమకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని జీప్స్, టాటా మ్యాజిక్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్.సమ్మయ్య, జి.మల్లేశ్ విన్నవించారు.

జీవన భృతి ఇవ్వాలని, జీవిత బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. తన భర్త చనిపోయాడని, ఆయన పేరుపై గ్రామ శివారులో ఉన్న భూమిని తన పేరిట విరాసత్ పట్టా చేయాలని కోటపల్లి మండలం సిర్స గ్రామానికి చెందిన ధర్ని లస్మక్క అర్జీ సమర్పించారు. వీటితోపాటు పలు అర్జీలను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించనున్నట్లు చెప్పారు. జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ఆసిఫాబాద్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో డీఆర్ఓ కదం సురేశ్​తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తన భర్త మరణించాడని, తనకు ఐదేండ్ల కూతురు ఉందని

ఏదైనా ఉపాధి కల్పించాలని జిల్లా కేంద్రానికి చెందిన జూపాక సుజాత వినతిపత్రం అందించారు. తమ కాలనీకి విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్య పరిష్కరించాలని సిర్పూర్​లోని న్యూ కాలనీకి చెందిన కాలనీవాసులు కోరారు. వీటితోపాటు పలువురు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు.

సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

గుడిహత్నూర్ : ఏజెన్సీ ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్‌ ఐటీడీఏలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు. దహెగాం మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బుర్రి నానయ్య తనకు బోరు బావి మంజూరు చేయాలని, ఉట్నూర్‌ గ్రామానికి చెందిన బాలేపు రాములు ఆసరా పెన్షన్‌ ఇప్పించాలని,ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఉర్వెత నవీన తనకు గురుకుల కాలేజీలో సీఆర్‌టీ జాబ్‌ ఇప్పించాలని

బజార్‌ హత్నూర్‌ మండలం రత్తన్నగూడకు చెందిన కుమ్రం మాధవ్‌ అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరారు. పెన్షన్స్, డబుల్‌ బెడ్రూం, సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ స్కీమ్‌ల మంజూరు, అగ్రికల్చర్, రెవెన్యూ డిపార్ట్​మెంట్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల ఆఫీసర్లను పీవో ఆదేశించారు. ప్రజావాణిలో ఏపీవో భీంరావు, ఏడీఎంహెచ్‌వో కుమ్ర బాలు, ఏవో రాంబాబు,  పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, పీహెచ్‌వో సందీప్ ఇతర అధికారులు పాల్గొన్నారు.