- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేను జిల్లాలో సమర్థంగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్, గణాంక అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి సరైన నిర్ణయాలు తీసుకొని అవసరమైన ప్రణాళికలు తయారు చేసి అమలు చేసేందుకు సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లును నియమించి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. నోడల్ అధికారుల నియామకంలో డాటా, కమ్యూనిటీ నిర్వహణ, జనగణనలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జిల్లా గణాంక అధికారి సత్యం, ముఖ్య ప్రణాళిక అధికారి మహ్మద్ ఖాసీం పాల్గొన్నారు.