
జైపూర్, వెలుగు: సాగుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జైపూర్ మండలంలోని సుందిళ్ల బ్యారేజీ, శివ్వారం గ్రామ సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణతో కలిసి పర్యటించి వ్యవసాయ పరిస్థితులపై రైతులతో మాట్లాడారు.
పంట సాగుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి పనులు, ఇతర నిధుల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, ఎల్ఆర్ఎస్ ఫీజు, ఆస్తి పన్ను వసూలు అంశాలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఎల్ఆర్ఎస్ పథకంలో అందిన దరఖాస్తుల్లో అర్హులైన వారి నుంచి ఫీజు వసూలు ప్రక్రియను స్పీడప్చేయాలని, ఈ నెల 31 వరకు చెల్లించినట్లయితే లభించే 25 శాతం రాయితీ మినహాయింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
తాగునీటి సమస్యల్లేకుండా చూడాలి
ఎండాకాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలె క్టర్ సూచించారు. భీమారం మండలం దాంపూర్ గ్రామ పంచాయతీలో నీటి సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి పనులను సమీక్షించి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాన్ని సంద ర్శించి పిల్లల సంరక్షణ చర్యలను పరిశీలించారు. మెను ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలన్నారు. మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, ఎస్సై నాగరాజు, ఏపీవో బాలయ్య, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బన్సీలాల్, ఎంపీడీవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.