రక్తదానం అభినందనీయం : కలెక్టర్ కుమార్ దీపక్

రక్తదానం అభినందనీయం : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: రహదారి ప్రమాదాలు, తలసేమియా, గర్భిణులు, అత్యవసర సమయాల్లో రక్తం అవసరమున్న వారికోసం స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టికన్వెన్షన్ హాల్​లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం, కంటి పరీక్షల శిబిరానికి డీసీపీ ఎ.భాస్కర్, జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్, ఆస్పత్రి పర్యవేక్షకుడు హరిశ్చంద్రారెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్​రెడ్డితో కలిసి కలెక్టర్​హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా గొప్పదని, ఒకరి ప్రాణాలు కాపాడటం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. 40 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. 18 ఏండ్లు నిండని వారికి, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వొద్దని తెలిపారు. రక్తదాన శిబిరంలో 53 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయగా వారికి ధ్రువపత్రాలు అందించారు.