
నస్పూర్, వెలుగు: నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వారికి అవకాశం కల్పిస్తోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల నగరపాలక సంస్థ ఆఫీస్లో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాస కౌంటర్లను మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఈ పథకం ద్వారా చేయూతనందిస్తున్నామని తెలిపారు.
అర్హులైన వారు ఈ నెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే 100 శాతం మాఫీ, రూ.లక్షకు 90 శాతం రాయితీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుందన్నారు. రాయితీ పోనూ మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. లే అవుట్ క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపుదారులకు అవగాహన కల్పించి, సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.